ఆదివారం 31 మే 2020
Business - Apr 13, 2020 , 00:16:33

ఇదే సరైన సమయం

ఇదే సరైన సమయం

  • చైనానుంచి నిష్క్రమించే సంస్థల్ని భారత్‌ ఆకర్షించాలి: ఎఫ్‌ఐఈవో

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి తమ తయారీ కేంద్రాలను మార్చాలని చూస్తున్న సంస్థలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయమని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రధాని మోదీ దృష్టిపెట్టాలని కోరింది. భూ సేకరణ చట్టంలో మార్పులు తేవాలని, నెల రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, రెండు నెలల్లో బ్యాంక్‌ రుణాలను మంజూరు చేయాలని ఎఫ్‌ఐఈవో అధ్యక్షుడు ఎస్‌ సరఫ్‌ ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. భూములు అందుబాటులో ఉంటే అన్ని రాష్ర్టాల పారిశ్రామిక అభివృద్ధి మండలిలు నెల రోజుల్లో కేటాయించాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూముల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు షరతులతో కూడిన అనుమతుల్ని ఇవ్వాలని ఆ లేఖలో సరఫ్‌ సూచించారు. మరో అటవీ భూమిలో పరిశ్రమ యాజమాన్యాలతో మొక్కలు నాటించాలని, దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి లభిస్తుందని సూచించారు. ప్రస్తుతం భారీ సంస్థలే భారత్‌కు వస్తున్నాయని, క్షేత్రస్థాయి సమస్యలను తీర్చితే చిన్న, మధ్యతరహా సంస్థలూ దేశంలోకి వస్తాయని చెప్పారు. 

పరిశ్రమ పునర్నిర్మితం కావాలి: సద్గురు

కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిశ్రమలుసహా అనేక రంగాలు పునర్నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. ఆదివారం ఫిక్కీ, ఈశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, తన 65 ఏండ్ల వైద్య వృత్తిలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదని అపోలో హాస్పిటల్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ ఇంటరాక్టివ్‌ సేషన్‌లో ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతారెడ్డి, మాజీ అధ్యక్షుడు సందీప్‌ సోమనిలు పాల్గొన్నారు.


logo