సోమవారం 30 మార్చి 2020
Business - Jan 18, 2020 , 01:03:16

10 లక్షల ఉద్యోగాలు

 10 లక్షల ఉద్యోగాలు
  • -వచ్చే ఐదేండ్లలో సృష్టిస్తామన్న అమెజాన్‌ అధినేత బెజోస్‌
  • -ఐటీ, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ, జనవరి 17:రాబోయే ఐదేండ్లలో భారత్‌లో మరో 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే దిశగా వెళ్తున్నామని ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ శుక్రవారం ప్రకటించింది. దేశంలో అమెజాన్‌ పెట్టుబడులతో ఎలాంటి మేలూ జరుగడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెజాన్‌ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2025కల్లా 10 లక్షల ఉపాధి అవకాశాల్ని అందిస్తామని అమెజాన్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో గడిచిన ఆరేండ్లకుపైగా కాలంలో అమెజాన్‌ పెట్టిన పెట్టుబడులతో 7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేసిన బెజోస్‌.. రాబోయే ఐదేండ్లలో అదనంగా మరో 10 లక్షల ఉద్యోగాలను పుట్టిస్తామని చెప్పారు. భారత్‌లో అమెజాన్‌ పెడుతున్న పెట్టుబడుల ద్వారా దేశానికి ఒరిగిందేమీ లేదని గోయల్‌ ఇక్కడ జరిగిన ‘రైసినా డైలాగ్‌'లో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. సంస్థకు వాటిల్లుతున్న భారీ నష్టాలను ఎలా? పూడ్చుకుంటున్నారని అమెజాన్‌ను ప్రశ్నించిన ఆయన భారత్‌లో అక్రమ వ్యాపార విధానాలను అవలంభిస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు.


మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న బెజోస్‌.. బుధవారం దేశీయంగా ఉన్న చిన్న, మధ్యతరహా సంస్థల డిజిటలైజేషన్‌ కోసం రూ.7 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. 2025 నాటికి భారత్‌లో తయారైన 10 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తూత్పత్తుల ఎగుమతిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ‘భారత్‌లో మేము పెడుతున్న పెట్టుబడులు.. వర్తకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల సాంకేతికాభివృద్ధి కోసమే. ఇక్కడి ప్రజలకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడానికే’ అని అమెజాన్‌ ఈ సందర్భంగా తెలియజేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన అతిపెద్ద క్యాంపస్‌ బిల్డింగ్‌నూ గుర్తుచేసింది. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో అమెజాన్‌కున్న అతిపెద్ద సెంటర్‌ ఇదేనని, ఇక్కడ 15 వేల మంది పనిచేస్తున్నారని వివరించింది. కాగా, అమెజాన్‌ ప్రైం వీడియో పనితీరు బాగుందని, ఇందులో పెట్టుబడులను రెట్టింపు చేస్తామని బెజోస్‌ ప్రకటించారు.

తప్పుడు ప్రచారం: గోయల్‌

అమెజాన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని, అలాంటిదేమీ లేదని కేంద్ర మంత్రి గోయల్‌ తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండాలని మాత్రమే చెప్పినట్లు వివరించారు. భారత్‌లోకి వచ్చే అన్ని విదేశీ పెట్టుబడులు.. ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందేనన్న ఆయన చట్టాలను గౌరవించే పెట్టుబడులనే తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని శుక్రవారం అహ్మదాబాద్‌లో స్పష్టం చేశారు. మూడు రోజుల ‘అహ్మదాబాద్‌ డిజైన్‌ వీక్‌'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెజాన్‌ను ఉద్దేశించి తాను చేసిన సూచనలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-కామర్స్‌ పరిశ్రమ కోసం భారత్‌లో కొన్ని నియమ, నిబంధనలున్నాయని వీటిని పాటించాలని ట్విట్టర్‌లోనూ కోరారు.

బెజోస్‌ నోట షారూఖ్‌ డైలాగ్‌

క్షణం కూడా తీరిక లేని వ్యాపార పనులతో బిజీబిజీగా గడిపే జెఫ్‌ బెజోస్‌.. భారత పర్యటన సరదాగా సాగింది. అమెజాన్‌ ప్రైం వీడియో కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కలిసిన బెజోస్‌.. కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘డాన్‌'లోని ఓ డైలాగ్‌ను పలికి ఆశ్చర్యపరిచారు. షారూఖ్‌ ఖాన్‌, డైరెక్టర్‌ జోయో అక్తర్‌లతో చాటింగ్‌ సందర్భంగా ఆఖర్లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మొదట షారూఖ్‌ తన ఫేమస్‌ డైలాగ్‌ ‘డాన్‌ కో పకడ్నా ముష్కిల్‌ హై నహీ నమమ్కిన్‌ హై’ చెప్పారు. దీన్ని బెజోస్‌ కోసం ‘జెఫ్‌ బెజోస్‌ కో పకడ్నా ముష్కిల్‌ హై నహీ ఇంపాజిబుల్‌ హై’ అని షారూఖ్‌ మార్చారు. దీంతో ఎట్టకేలకు ఈ డైలాగ్‌ పలికి బెజోస్‌ అందర్నీ ఆకట్టుకున్నారు. కాగా, తాను ‘స్టార్‌ ట్రెక్‌' చిత్రాల్లో నటించాలని ఆశపడే వాడినని, ఒక్క పాత్ర ఇవ్వాలంటూ వేడుకున్నానని ఈ సందర్భంగా బెజోస్‌ తన వ్యక్తిగత జీవిత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఎక్కడ ఈ చిత్ర నిర్మాణాలు జరిగినా.. అక్కడికి వెళ్లి అందర్నీ అడిగేవాడినంటూ చెప్పుకొచ్చారు. చివరకు 2016లో ‘స్టార్‌ ట్రెక్‌ బియాండ్‌' చిత్రంతో తన కల నెరవేరిందన్నారు. ఇందులో స్టార్‌ఫ్లీట్‌ అధికారిగా తాను కనిపించినట్లు చెప్పారు. ఇప్పటిదాకా తాను కలిసిన గౌరవప్రద వ్యక్తుల్లో షారూఖ్‌ ఒకరని బెజోస్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి కమల్‌హాసన్‌, విద్యాబాలన్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితర ఎందరో సినీ ప్రముఖులు హాజరైయ్యారు.


logo