బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:20:50

లక్ష్యసాధన కష్టమే

లక్ష్యసాధన కష్టమే
  • ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లపై గార్గ్‌

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆదివారం అన్నారు. రూ.2.5 లక్షల కోట్లు లేదా జీడీపీలో 1.2 శాతం తగ్గవచ్చని చెప్పారు. 2019-20లో రూ.24.59 లక్షల కోట్ల స్థూల పన్ను ఆదాయాన్ని మోదీ సర్కారు అంచనా వేసింది. అయితే ఈ లక్ష్యం చాలా పెద్దదని అభిప్రాయపడ్డ గార్గ్‌.. ఈ ఆర్థిక సంవత్సరాన్ని అసంతృప్తికర ఏడాదిగా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు సైతం పన్ను వసూళ్లకు ప్రతిబంధకాలుగా మారాయి. తగ్గిన వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం, మార్కెట్‌లో ఏర్పడిన స్తబ్ధత సర్కారీ ఆదాయానికి గండి కొడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


డీడీటీ రద్దు చేయాలి

డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను రద్దు చేయాలని గార్గ్‌ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీడీటీకి గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఇదేనన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాయన్న ఆయన డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మదుపరులకు ఆయా సంస్థలు ఇచ్చే డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రేటే ఈ డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌. ప్రస్తుతం ఇది 15 శాతంగా ఉన్నది.


ఐటీ సంస్కరణలు

ఆదాయం పన్ను (ఐటీ) రేట్ల విధానాన్ని సరళతరం చేయాలని గార్గ్‌ సూచించారు. సెస్సు లేదా సర్‌చార్జీ లేకుండా 4 శ్లాబులు చాలన్నారు. రూ.5 లక్షల వరకున్న వార్షిక ఆదాయంపై పన్నులు వద్దని, రూ.5-10 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.10-25 లక్షలపై 15 శాతం, రూ.25-50 లక్షలపై 25 శాతం పన్నుండాలన్నారు. ఏటా రూ.50 లక్షలకుపైగా ఆదాయమున్నవారిపై 35 శాతం పన్ను వేయాలని సూచించారు. ప్రస్తుతం 8 శ్లాబుల్లో ఆదాయం పన్ను రేట్లు అమల్లో ఉండగా, అత్యధికం 40 శాతంగా ఉన్నది.


logo