సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:06:34

ప్రపంచమంతటికీ భారత్‌ వ్యాక్సిన్‌

ప్రపంచమంతటికీ భారత్‌ వ్యాక్సిన్‌

  • దేశీయ ఔషధ పరిశ్రమకు  బిల్‌గేట్స్‌ కితాబు
  • సీరం ఇన్‌స్టిట్యూట్‌, బయో ఈ, భారత్‌ బయోటెక్‌కు ప్రత్యేక ప్రశంసలు

న్యూఢిల్లీ, జూలై 16: భారత ఔషధ పరిశ్రమపై మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సొంత దేశానికే కాకుండా యావత్‌ ప్రపంచానికి అవసరమైనంత కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయగల సామర్థ్యం భారత ఔషధ పరిశ్రమకు ఉన్నదని కొనియాడారు. కొవిడ్‌-19 మృతుల సంఖ్యను తగ్గించేందుకు, మన రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ‘భారత్‌లో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు భారత ఔషధ పరిశ్రమ విశేష కృషి చేస్తున్నది. 

ఇతర వ్యాధులకు మందులను తయారు చేసేందుకు ఏర్పాటు చేసుకొన్న సదుపాయాలను కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగిస్తున్నారు’ అని బిల్‌ గేట్స్‌ తెలిపారు. ‘కొవిడ్‌-19: వైరస్‌పై భారత్‌ పోరు’ అనే అంశంపై డిస్కవరీ ప్లస్‌ చానల్‌ చిత్రీకరించిన డాక్యుమెంటరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌ అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, అధిక జనాభా ఉన్న దేశం కావడం, పట్టణాల్లో జనసాంద్రత అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత ఔషధ పరిశ్రమ సత్తా గురించి ఆయన మాట్లాడుతూ.. యావత్‌ ప్రపంచానికి భారత్‌ అతిపెద్ద ఔషధ, వ్యాక్సిన్‌ సరఫరాదారుగా కొనసాగుతున్నదన్నారు. 

భారత ఔషధ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీస్థాయిలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, వీటిని తయారు చేస్తున్న సంస్థల్లో సీరం ఇన్‌స్టిట్యూట్‌, బయో ఈ, భారత్‌ బయోటెక్‌ లాంటి మేటి సంస్థలున్నాయని గుర్తుచేశారు. వ్యాక్సిన్ల అభివృద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కృషిచేస్తున్న సీఈపీఐ (కొయలేషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌)లో భారత్‌ కూడా చేరిందన్నారు. వివిధ వ్యాధులకు కొత్త వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ రెండు దశాబ్దాల నుంచి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాల్లో తమ ఫౌండేషన్‌ చురుకుగా పనిచేస్తున్నదని బిల్‌ గేట్స్‌ తెలిపారు.logo