మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 29, 2020 , 00:13:57

ఏడేండ్ల కనిష్ఠానికి జీడీపీ

ఏడేండ్ల కనిష్ఠానికి జీడీపీ
  • క్యూ3లో వృద్ధిరేటు 4.7 శాతానికి పతనం
  • తయారీరంగం మందగించడమే కారణం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వరుసగా మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో కూడా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణించింది. 4.7 శాతానికి పతనమై దాదాపు ఏడేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. 2012-13 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) తర్వాత ఇదే అత్యల్ప వృద్ధిరేటు. ఆ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.3 శాతంగా నమోదైంది. తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గడమే తాజా పతనానికి ప్రధాన కారణమని శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గత ఆర్థిక సంవత్సర (2018-19) మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.6 శాతంగా నమోదైంది. 


ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో తొలుత 4.5 శాతంగా అంచనావేసిన జీడీపీ వృద్ధిరేటును ఆ తర్వాత 5.1 శాతానికి, తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో వృద్ధిరేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి సవరించారు. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్వో) తాజాగా విడుదలచేసిన గణాంకాల ప్రకారం ఏడాది క్రితం తయారీ రంగంలో 5.2 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో 0.2 శాతం, నిర్మాణరంగ వృద్ధిరేటు 0.3 శాతం తగ్గింది. అలాగే ఈ వృద్ధిరేటు మైనింగ్‌ రంగంలో 4.4 శాతం నుంచి 3.2 శాతానికి, విద్యుత్‌, గ్యాస్‌, నీటిసరఫరా, ఇతర వినిమయ సేవల రంగంలో 9.5 శాతం నుంచి 8.8 శాతానికి, వాణిజ్యం, హోటల్‌, రవాణా, కమ్యూనికేషన్లు, ప్రసార సంబంధ సేవల రంగంలో 7.8 శాతం నుంచి 5.9 శాతానికి క్షీణించింది. 


అయితే వ్యవసాయ రంగంలో ఏడాది క్రితం 2 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో 3.5 శాతానికి పెరిగింది. అలాగే ఈ వృద్ధిరేటు ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, ప్రొఫెషనల్‌ సర్వీసుల రంగంలో 6.5 శాతం నుంచి 7.3 శాతానికి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిఫెన్స్‌, ఇతర సేవల రంగాల్లో 8.1 శాతం నుంచి 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 5.1 శాతానికి క్షీణించింది. స్థిర (2011-12) ధరల వద్ద గత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో రూ.35 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 4.7 శాతం వృద్ధితో రూ.36.65 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎన్‌ఎస్వో ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రస్తుత ధరల ప్రకారం 2018-19లో రూ.1,26,521గా ఉన్న తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంతవ్సరంలో 6.3 శాతం పెరిగి రూ.1,34,432కు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎన్‌ఎస్వో తెలిపింది. అయితే దేశ ఆర్థిక వృద్ధిరేటు అత్యంత కనిష్ఠస్థాయికి చేరిందని, ఇక ఇంతకంటే క్షీణించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి అతాను చక్రవర్తి అభిప్రాయపడ్డారు. బొగ్గు ఉత్పత్తితోపాటు రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుదుత్పత్తి పెరుగడంతో జనవరిలో ఎనిమిది కీలక రంగాల్లో 2.2 శాతం వృద్ధి నమోదైనట్టు వాణిజ్యశాఖ విడుదలచేసిన గణాంకాలు వెల్లడించాయి. 


ఆర్థికంలో ‘నిలకడ’ శుభసూచకం

4.7 శాతం జీడీపీపై నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్య


దేశ ఆర్థిక వ్యవస్థలో ‘నిలకడ’ శుభసూచకమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో జీడీపీ 4.7 శాతానికి చేరినట్టు శుక్రవారం అధికారిక గణాంకాలు వెలువడిన వెంటనే ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ముంబైలో సీఎన్‌బీసీ టీవీ-18 చానల్‌ నిర్వహించిన బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధిరేటు సంఖ్య మారుతుందని తాను భావించడంలేదన్నారు. ప్రస్తుతం చైనాతోపాటు పలు దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే దుష్ప్రభావం గురించి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన సమస్యలు మరో రెండు మూడు వారాలు కొనసాగితే అది సవాలుగా మారవచ్చని అంగీకరించారు. ముడిసరుకుల కోసం చైనా నుంచి వచ్చే దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశీయ ఫార్మా, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు ముఖ్యమైన వస్తువులను విమానాల ద్వారా తీసుకురావాలని సూచించాయని, ఆ సూచనను ప్రభుత్వం పరిశీలించవచ్చని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


పెరిగిన ద్రవ్యలోటు

దేశ ద్రవ్యలోటు మరింత పెరిగింది. జనవరి నెలాఖరుకే మొత్తం వార్షిక బడ్జెట్‌ లక్ష్యంలో 128.5 శాతానికి (రూ. 9,85,472 కోట్లకు) చేరినట్టు కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వెల్లడించిం ది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ద్రవ్యలోటు సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో 121.5 శాతంగా ఉన్నది. మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ద్రవ్యలోటును రూ.7,66,846 కోట్లకు (జీడీపీలో 3.3%) కట్టడి చేయాలని ప్రభు త్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అయితే ప్రభుత్వానికి రాబడి తగ్గడంతో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.8 శాతానికి పెంచినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో సార్వత్రిక బడ్జెట్‌ 2020 -21ను ప్రవేశపెడుతూ ప్రకటించారు.


logo
>>>>>>