బుధవారం 03 జూన్ 2020
Business - Apr 04, 2020 , 02:58:34

డేంజర్‌ బెల్స్‌

డేంజర్‌ బెల్స్‌

దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం

వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి తగ్గే అవకాశం

ఈ ఏడాది 2 శాతంలోపే ఉండొచ్చన్న ఫిచ్‌

4 శాతానికి పరిమితమవుతుందన్న ఏడీబీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా కాటుతో మరింత దిగజారనున్నదా? ఈ ప్రశ్నకు వివిధ వర్గాల నుంచి అవునన్న సమాధానమే వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి పతనమవుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌' అభిప్రాయపడింది. ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదవుతుందని ‘ఫిచ్‌' గతంలో అంచనా వేసింది. కానీ ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కొనసాగుతుండటం, మరోవైపు కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తమ అంచనాను కుదిస్తున్నామని, ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 2 శాతంలోపే ఉండవచ్చని ‘ఫిచ్‌' శుక్రవారం వెల్లడించింది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇటీవల చైనాలో పలు పరిశ్రమలు మూతపడటంతో భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలకు ముడిసరుకులు, విడిభాగాల సరఫరాలు ఆగిపోయాయి. ప్రస్తుతం చైనాలోని వివిధ పరిశ్రమల్లో మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవడంతో ఆ ప్రభావం భారత్‌ ఎగుమతులను, కొనుగోలు శక్తిని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటుపై మా అంచనాను 5.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నాం. భారత్‌లో గత 30 ఏండ్లలో ఇదే అతితక్కువ వృద్ధిరేటుగా నిలుస్తుంది’ అని ‘ఫిచ్‌' శుక్రవారం ఓ ప్రకటనలో వివరించింది. 2020-21లో భారత జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతంగా ఉంటుందని ‘ఫిచ్‌' గత నెల 20న అంచనా వేసింది. ఇది గతేడాది డిసెంబర్‌లో ‘ఫిచ్‌' అంచనా వేసిన 5.6 శాతం వృద్ధిరేటు కంటే 0.5 శాతం తక్కువ.

ఏడీబీ అంచనాలో భారీ కోత

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో ఏడీబీ ఈ అంచనా వేసింది. అయితే స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండటంతో 2021-22లో భారత వృద్ధిరేటు పుంజుకొంటుందని ఏడీబీ తన ‘ఆసియా డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌'లో పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధిరేటు 5 శాతంగా నమోదవుతుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్వో) అంచనా వేసింది. ‘ప్రస్తుతం మ నం అసాధారణ సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కొవిడ్‌-19 మహమ్మారి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలను, ఇతర ఆర్థిక కార్యకలాపాలను దారుణంగా దెబ్బతీసింది. కానీ భారత స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు బలంగా పుంజుకొంటుందని మేము భావిస్తున్నాం’ అని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త యసుయుకీ సవాడ తెలిపారు. కరోనా కాటు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకొనేందుకు అధికారులు చాలా చురుకుగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నులకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయరంగంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఆర్థిక వ్యవస్థపై వత్తిడిని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు భారత్‌ వేగవంతంగా పుంజుకొనేందుకు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. 

కోరలు చాస్తున్న నిరుద్యోగం
గతనెలలో 8.74 శాతానికి చేరిక

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్‌ సమర్థంగా పోరాడుతున్నప్పటికీ దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగి దాదాపు 9 శాతానికి చేరింది. గత 43 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ నిరుద్యోగరేటు గత నెలలో 8.74 శాతానికి చేరిందని, డీమానిటైజేషన్‌ (పెద్దనోట్ల చెలామణి రద్దు) తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. అంతకుముందు 2016 ఆగస్టులో నిరుద్యోగరేటు 9.59 శాతంగా నమోదయింది. ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగరేటు పట్టణ ప్రాంతాల్లో 9.35 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.45 శాతంగా ఉన్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో దేశ నిరుద్యోగరేటు 7.78 శాతంగా నమోదయింది. జులై, అక్టోబర్‌ నెలలు మినహా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ రేటు చాలావరకు 8 శాతంలోపే కొనసాగింది. జులై, అక్టోబర్‌ నెలల్లో మాత్రం 8 శాతం దాటింది. రాష్ర్టాలవారీగా చూస్తే ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగరేటు త్రిపురలో అత్యధికం (29.9 శాతం)గా, పుదుచ్చేరిలో అత్యల్పం (1.2 శాతం)గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది.

సంస్కరణలు మొదలైన తర్వాత..

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలమైన దెబ్బ తగిలింది. ఇప్పటికే గత ఆరు త్రైమాసికాల నుంచి మందగమన దశలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్‌ దెబ్బ శరాఘాతం లాంటిది. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు మరింత దిగజారుతుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన (1991) తర్వాత అతితక్కువ వృద్ధిరేటు ఈ ఏడాదే నమోదు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్దీపనలను ప్రకటించినా.. మార్కెట్లలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు ఎంత పటిష్ఠమైన చర్యలు చేపట్టినా జీడీపీ వృద్ధిరేటు మరింత క్షీణించడం ఖాయం. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మెరుగుపడవచ్చు.

- ఎన్‌ఆర్‌ భానుమూర్తి, ప్రొఫెసర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ ప్రాపర్టీ



logo