ఆదివారం 31 మే 2020
Business - May 21, 2020 , 23:47:14

ఇది భారీ ఆర్థిక విపత్తు

ఇది భారీ ఆర్థిక విపత్తు

  • కేంద్రం ఒక్కటే ఎదుర్కోలేదు
  • ప్రతిపక్షాల సాయంచాలా అవసరం
  • దేశంలో కరోనా ప్రభావంపై రాజన్‌

న్యూఢిల్లీ, మే 21: భారత్‌ ప్రస్తుతం భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే పోరాడలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ‘నేను చాలా ఆందోళన చెందుతున్నది మనం (భారత్‌) ఎదుర్కొంటున్న విపత్తు మరింత ముదురుతున్నదనే. కేంద్ర ప్రభుత్వం ఒక్కటే దీనిపై పోరాడలేదు. తప్పక ప్రతిపక్షాలను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి’ అని ‘ది వైర్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న ఆయన.. వీటిని ప్రధాని కార్యాలయం ఒక్కటే ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. అందుకే దేశంలోని నిపుణులు, ప్రతిభావంతులను సంప్రదించాలని, అలాంటివారు రాజకీయ ప్రత్యర్థులైనా సంశయం వద్దన్నారు. అందరూ కలిస్తేనే ఈ మహమ్మారి సృష్టించిన విపత్తుకు పరిష్కారం దొరుకగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఒక్కటే ఇప్పుడు సవాల్‌ కాదన్న రాజన్‌.. గత ఆర్థిక వైభవాన్ని అందుకోవడం కూడా కీలకమేనన్నారు. దేశంలో ఎందరో మేధావులున్నారని, వారందరికీ పిలుపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సిన్హా, పీ చిదంబరం వంటి వాళ్లను మీరు సిఫార్సు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు పేర్లు చెప్పకుండా రాజకీయ విభేదాలను మరిచి అందరి సాయం తీసుకున్నప్పుడే ఈ కష్టకాలం నుంచి గట్టెక్కగలమని 45 నిమిషాలపాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో బదులిచ్చారు.

రేటింగ్స్‌ను వదిలేయాలి

ద్రవ్యలోటు పెరిగితే రేటింగ్‌ ఏజెన్సీల స్పందన ఎలా? ఉంటుందోనన్న భయాలను ప్రభుత్వం వీడాలని రాజన్‌ హితవుపలికారు. బహుశా దీనివల్లేనేమో ఆర్థికపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే స్పందిస్తున్నదని అన్నారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఖర్చుల పెంపు అత్యవసరమని గుర్తుచేశారు. ఏదిఏమైనా త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

వలస కార్మికులను ఆదుకోవాలి

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లు వలస కార్మికులకు జీవన్మరణ సమస్యల్ని తెచ్చిపెట్టాయని రాజన్‌ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార అవసరాలు, ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇటీవలి ఆర్థిక ప్యాకేజీ.. వలస కార్మికులకు ఆహారోత్పత్తులను అందించినా అవి సరిపోవని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరికి ఉపాధి కరువైందని, కాబట్టి పాలు, కూరగాయలు, వంటనూనె అవసరాలతోపాటు అద్దెల చెల్లింపునకు నగదు ఇవ్వాలని సూచించారు.

అదేం ప్యాకేజీ..?

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ.. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోదని రాజన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీడీపీ కోలుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ చాలదన్నారు. ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉందా?.. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు స్పందన కరువైందా? అన్న ప్రశ్నలకు భారత్‌లో ఇప్పుడు ఎంత స్పందించినా అది తక్కువేనని జవాబిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని, దీన్ని పరుగులు పెట్టించాలంటే ఈ ప్యాకేజీలు ఎంతమాత్రం సరిపోవని తేల్చి పారేశారు. మరిన్ని గొప్ప ఉద్దీపనల అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిందన్న ఆయన కాపాడటానికి ఉన్న వనరులు పరిమితమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. అందుకే ఈ విపత్తును అరికట్టడానికి ఉన్న ప్రతీ అవకాశాన్నీ భారత ప్రభుత్వం తప్పక ఉపయోగించుకోవాల్సిందేనని సూచించారు. నిజానికి కేంద్ర ప్యాకేజీలో కొన్ని మంచి నిర్ణయాలున్నా.. ఇంకా అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక నిర్మాణ, మౌలిక రంగాల అభివృద్ధితో కూడిన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఇప్పుడు అసలైన పరీక్ష అని రాజన్‌ అన్నారు. వైరస్‌తో పోరాటం కంటే దేశ జీడీపీని వృద్ధి బాట పట్టించడమే చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను వ్యూహాత్మకంగా జయించడం కూడా ప్రధానమేనన్నారు. 


logo