బుధవారం 03 జూన్ 2020
Business - May 04, 2020 , 02:22:46

మళ్లీ గాల్లోకి

మళ్లీ గాల్లోకి

  • జూన్‌ తొలి వారం నుంచి  దేశీయ విమానయాన సేవలు?
  • కొన్ని సంస్థల్లో ఇప్పటికే బుకింగ్స్‌ మొదలు

న్యూఢిల్లీ, మే 3: దేశంలో లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విమానయాన సేవలు త్వరలో మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించినప్పటికీ దేశీయ విమానయాన సంస్థలు జూన్‌ మొదటివారం నుంచి తమ సేవలను పునఃప్రారంభించబోతున్నాయని, ఇందుకోసం 10 రోజుల ముందు నుంచి బుకింగ్‌లను మొదలుపెట్టేందుకు విమానయాన సంస్థలను అనుమతించాలని భావిస్తున్నామని పౌరవిమానయాన శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదంతా దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది కేవలం దేశీయ సర్వీసులకు మాత్రమే పరిమితమని, అంతర్జాతీయ విమానయాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి చర్చ జరుగలేదని ఆయన చెప్పారు. అయితే గోఎయిర్‌, స్పైస్‌జెట్‌ సంస్థలు ఈ నెల 16 నుంచి అన్ని ప్రధాన సెక్టార్లలో విమానాలను నడిపేందుకు ఇప్పటికే బుకింగ్స్‌ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. ఇదేవిధంగా విస్తారా, ఎయిర్‌ఏషియా, ఇండిగో లాంటి ఇతర సంస్థలు జూన్‌ 1 నుంచి విమానాలను నడిపేందుకు బుకింగ్స్‌ను పునఃప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎయిర్‌ ఇండియా మాత్రం ఇప్పట్లో బుకింగ్స్‌ను మొదలుపెట్టేందుకు నిరాకరిస్తుస్తున్నది. వాస్తవానికి దేశీయ విమానయాన సంస్థలు ఏప్రిల్‌ 15 నుంచే బుకింగ్‌లను ప్రారంభించనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించడంతో ఆ వార్తలు కార్యరూపం దాల్చలేదు. logo