ప్రైవేట్ భాగస్వామ్యంతో 2 నెలల్లో 50 కోట్లకు కరోనా టీకా!

న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి ఇండియన్లందరికీ వ్యాక్సినేషన్ చేయాలంటే ప్రభుత్వం తక్షణం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని అనుమతించాలని విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్జీ పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలు, సంస్థల భాగస్వామ్యానికి అనుమతినిస్తే కేవలం రెండు నెలల్లోనే 50 కోట్ల మంది పౌరులకు వ్యాక్సినేషన్ చేయొచ్చునని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలపై బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ నిర్వహించిన చర్చాగోష్టిలో చెప్పారు.
ఈనాడు భారీస్థాయిలో వ్యాక్సినేషన్ చేయడం కీలక అవసరం. ఈ దిశగా ప్రభుత్వ పనితీరు బెస్ట్. కానీ ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అజీం ప్రేమ్జీ వ్యాఖ్యానించారు. ఆమోదయోగ్యమైన ధరకు ప్రజలందరికీ తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ చేపట్టాలని పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ను రూ.300లకు తీసుకుని సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్ హోంలు రూ.100లకు సదరు టీకాలను ప్రజలకు ఇవ్వవచ్చు అని అజీం ప్రేమ్జీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.