మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 29, 2020 , 00:52:54

ఆశలన్నీ బడ్జెట్‌పైనే

ఆశలన్నీ బడ్జెట్‌పైనే
  • వ్యాపార, పారిశ్రామికరంగాల్లో కోటి అంచనాలు
  • మందగమనాన్ని ఎదుర్కొనే చర్యలుండాలని సూచనలు

న్యూఢిల్లీ, జనవరి 28:దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న మందగమనాన్ని తొలగించేలా రాబోయే బడ్జెట్‌ ఉండాలని వ్యాపార, పారిశ్రామిక రంగాలు కోరుతున్నాయి. వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటో రంగాన్ని ఆదుకునేలా సంస్కరణలు, నిర్ణయాలుంటాయన్న ఆశాభావాన్ని వాహన ఆధారిత పరిశ్రమలు వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ‘ఈ బడ్జెట్‌లో ఆటో రంగానికి ఊతమిచ్చే సంస్కరణలు, నిర్ణయాలుంటాయని మేము భావిస్తున్నాం. మందగమనాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా, అమ్మకాలను పెంచేలా చర్యలు చేపడుతారని విశ్వసిస్తున్నాం’ అని గల్ఫ్‌ ఆయిల్‌ ఎండీ రవి చావ్లా అన్నారు. వినియోగదారుల చేతుల్లో మరింత డబ్బు ఉండేలా ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడాలన్నారు. గతేడాది అన్ని రకాల వాహన అమ్మకాలు పడిపోయాయని భారతీయ ఆటోమొబైల్‌ తయారీదారుల సమాజం (ఎస్‌ఐఏఎం) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


రీఫైనాన్స్‌ విండో కావాలి

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు తమకు ఓ శాశ్వత రీఫైనాన్స్‌ విండో కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 2018 సెప్టెంబర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) సంక్షోభం వెలుగుచూసిన దగ్గర్నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు నగదు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకింగ్‌ రంగం.. ఎన్‌బీఎఫ్‌సీ ఇబ్బందులనూ తలకెత్తుకోవడానికి ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన పరిష్కారం ఉండాలని ఎన్‌బీఎఫ్‌సీలు కోరుతున్నారు. 


ఎస్‌టీటీ, సీటీటీలను తగ్గించాలి

సెక్యూరిటీస్‌ ట్రాన్జాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ), కమోడిటీస్‌ ట్రాన్జాక్షన్‌ ట్యాక్స్‌ (సీటీటీ) రేట్లను తగ్గించాలని కమోడిటీ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీపీఏఐ) కేంద్రాన్ని కోరింది. ఈ రేట్ల కోతలతో భారతీయ మార్కెట్లలో ట్రేడింగ్‌కు ఊతమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. ట్రేడింగ్‌ నిర్వహణ అధిక వ్యయంతో కూడుకుంటున్నదని, దీనివల్ల సగటు మదుపరుల భాగస్వామ్యం తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సెక్షన్‌ 88 ఈ కింద రిబేటునివ్వాలని కోరింది. ప్రస్తుతం సీటీటీ, జీఎస్టీ, స్టాంప్‌ డ్యూటీ, ఎక్సేంజ్‌ చార్జీలు, మూలధన లాభాల పన్ను వంటి వాటితో దేశీయ మార్కెట్లలోని మదుపరులు పెట్టుబడులకు జంకుతున్నారని సీపీఏఐ అంటున్నది. 2013లో సీటీటీని అమల్లోకి తెచ్చిన దగ్గర్నుంచి కమోడిటీ మార్కెట్లలో వాల్యూమ్‌ లెవల్స్‌ 61 శాతం పడిపోయాయి. 2011-12లో రూ.69,449 కోట్లుగా ఉంటే, 2018-19లో రూ.27,291 కోట్లుగా ఉన్నాయి.


పర్యాటకరంగాన్ని ఆదుకోవాలి

పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని థామస్‌ కుక్‌ ఇండియా లిమిటెడ్‌ సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ అయ్యర్‌ కోరారు. ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బుంటే పర్యాటక రంగం వృద్ధిపథంలో నడుస్తుందని, ఎక్కువ మంది దేశ, విదేశీ ప్రయాణాలకు వెళ్తారని అన్నారు. అందుకే వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లలో కోతలు పెట్టాలని, మూలధన లాభాల పన్ను తగ్గించాలని సూచించారు. ఈశాన్య రాష్ర్టాల్లోని కొత్త పర్యాటక ప్రాంతాలకు జోష్‌ను నింపే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈసారైనా ఆదరించాలి

రత్నాలు, ఆభరణాల పరిశ్రమ గత కొన్నేండ్లుగా బడ్జెట్లలో నిరాదరణకు గురవుతున్నదని, ఈ రంగం వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డివైన్‌ సొలిటైర్స్‌ వ్యవస్థాపక ఎండీ జిగ్నేశ్‌ మెహెతా అన్నారు. ఈసారైనా తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. నీరవ్‌ మోదీ కుంభకోణంతో వజ్రాల పరిశ్రమపై దుష్ప్రభావం పడిన సంగతి విదితమే. దీంతో ఈ రంగానికి బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వకపోగా, పాత రుణాల వసూలుకు ఒత్తిడి తెస్తున్నారు. అసలే ఆర్థిక మందగమన పరిస్థితులతో మార్కెట్‌ స్తబ్ధుగా ఉందని, అమ్మకాల్లేక వ్యాపార నిర్వహణే ప్రమాదంలో పడిందన్నారు. ఈ సమయంలో బ్యాంకర్ల తీరు బాధిస్తున్నదంటున్న వజ్రాల వ్యాపారులు.. విక్రయాలు పెరిగేలా పలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డిజిటలైజేషన్‌కూ పట్టుబడుతున్నారు.


logo
>>>>>>