శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 25, 2020 , 00:17:45

సంస్కరణలు ఆగొద్దు

సంస్కరణలు ఆగొద్దు

  • అప్పుడే మరిన్ని పెట్టుబడులు
  • భారత్‌కు ఐఎంఎఫ్‌ సూచన

వాషింగ్టన్‌: భారత్‌లోకి పెట్టుబడులు రావాలంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. దేశంలో కరోనా ధాటికి మందగించిన వ్యాపార పరిస్థితులను మెరుగు పరిచేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలు కావాలని ఐఎంఎఫ్‌ ప్రధాన అధికార ప్రతినిధి గెర్రీ రైస్‌ అన్నారు. అప్పుడే స్థిరమైన, బలమైన వృద్ధిరేటు సాధ్యమని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ దివాలా చట్టం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తదితర సంస్కరణలు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్‌ను పైకి తీసుకెళ్లాయన్నారు. రెండేండ్లలో 37 స్థానాలు ఎగబాకిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఆర్థిక సంస్కరణలు భారత్‌ను పెట్టుబడులకు కేంద్రంగా మార్చగలవన్న ఆశాభావాన్ని రైస్‌ వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా భారత్‌లో 40 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పలు విదేశీ సంస్థలు పెట్టగా, కేవలం గతకొద్ది వారాల్లోనే 20 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలు భారీ పెట్టుబడులను ప్రకటించాయి.


logo