బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 27, 2020 , 00:46:22

బిలియనీర్ల భారతం

బిలియనీర్ల భారతం
  • చైనా, అమెరికా తర్వాత మనమే
  • దేశంలో గతేడాది నెలకు ముగ్గురు చొప్పున పెరిగిన బిలియనీర్లు
  • 138కి చేరిన అపర కుబేరులు -హురున్‌ సంపన్నుల జాబితా

ముంబై, ఫిబ్రవరి 26: చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు భారత్‌లోనే ఉన్నారు. దేశంలో 138 మంది డాలర్‌ బిలియనీర్లున్నట్లు తాజాగా విడుదలైన హురున్‌ నివేదిక స్పష్టం చేసింది. గతేడాది నెలకు దాదాపు ముగ్గురు చొప్పున డాలర్‌ బిలియనీర్లు పెరిగినట్లు 2019కిగాను బుధవారం విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2020 తెలిపింది. నిరుడు కొత్తగా 34 మంది అవతరించినట్లు వెల్లడించింది. బిలియనీర్ల దేశాల్లో 799 మందితో చైనా మొదటి స్థానంలో ఉంటే, 626 మందితో అమెరికా రెండో స్థానంలో ఉన్నది. 138 మందితో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. విదేశాల్లో ఉన్న భారతీయులనూ కలిపితే ఈ సంఖ్య 170కి పెరుగుతుండటం గమనార్హం. ఇక ఈ జాబితా బిలియన్‌ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన ప్రపంచంలోని 2,817 మందితో రూపొందింది. 


గంటకు 7 కోట్లు పెరిగిన ముకేశ్‌ సంపద

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 67 బిలియన్‌ డాలర్లతో టాప్‌-10లో ఉన్నారు. గంటకు రూ. 7 కోట్ల సంపద పెరిగింది. ఆసియాలోనే ధనవంతుడిగా మరోసారి నిలిచిన ముకేశ్‌.. గ్లోబల్‌ టాప్‌-10 బిలియనీర్లలో ఉన్న ఏకైక ఆసియా దేశస్తుడు కావడం గమనార్హం. ఇక గౌతమ్‌ అదానీ సంపద 7.1 బిలియన్‌ డాలర్లు ఎగిసి 17 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఈసారి 15 బిలియన్‌ డాలర్లతో టాప్‌-100 లిస్టులోకి ఉదయ్‌ కొటక్‌ చేరడం విశేషం. అలాగే 10.6 బిలియన్‌ డాలర్లకు డీ-మార్ట్‌ దమానీ సంపద ఎగబాకింది. 

మెరిసిన ఓయో రితేశ్‌ అగర్వాల్‌

ఓయో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిలియనీర్లలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈయన వయసు 24 ఏండ్లు. సంపద విలువ 1.1 బిలియన్‌ డాలర్లు. కాగా, గోద్రేజ్‌ గ్రూప్‌నకు చెందిన స్మిత వీ కృష్ణ భారతీయ సంపన్న మహిళగా నిలిచారు. ఈమె సంపద విలువ 4.5 బిలియన్‌ డాలర్లు.


ఏడుగురు హైదరాబాదీలు

జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సంపన్నులకు స్థానం లభించింది. వీరి సంపద విలువ 13 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. 50 మంది బిలియనీర్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా, వీరి వద్దనున్న సంపద విలువ దాదాపు 218 బిలియన్‌ డాలర్లు. ఢిల్లీలో 30 మంది, బెంగళూరులో 17 మంది, అహ్మదాబాద్‌లో 12 మంది ఉన్నారు.


logo
>>>>>>