గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 31, 2021 , 22:59:03

బడ్జెట్ ప్ర‌క్షాళ‌న‌: ఫిబ్రవరి ఒకటో తేదీకి చేంజ్

బడ్జెట్ ప్ర‌క్షాళ‌న‌: ఫిబ్రవరి ఒకటో తేదీకి చేంజ్

న్యూఢిల్లీ‌: అధికారం చేపట్టిన ఏడేండ్ల‌లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ బడ్జెట్‌లో చాలా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుల విధానంలో సవరణలు చేసింది. మరోపక్క బడ్జెట్‌ తేదీని కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చేసింది. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్‌ సూట్‌కేసు’ సంప్రదాయానికి తెర దించింది. 

2019 నుంచి ఎర్రటి వ‌స్త్ర‌పు సంచిలో బడ్జెట్‌ పత్రాలను తెచ్చే సంప్రదాయం ప్రారంభించింది. తాజాగా క‌రోనా నేప‌థ్యంలో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ పేప‌ర్‌లెస్‌గా ఉంటుంద‌ని ముందే ప్ర‌క‌టించారు. 

2014లో కేంద్రంలో మోదీ సర్కార్ తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బడ్జెట్‌లో ఆయన ఆదాయం పన్ను మినహాయింపు పరిధిని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు మినహాయింపును రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. ఇక 80ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షలు చేశారు. సెక్షన్‌ 8సీ పరిధిని రూ.లక్ష నుంచి రూ.1.5లక్షలకు పెంచగా.. గృహ రుణాల వడ్డీపై పన్ను మినహాయింపును రూ.1.5లక్షల నుంచి రూ. 2లక్షలకు చేర్చారు. 

2015లో నాటి విత్త జైట్లీ తన రెండో బడ్జెట్‌లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లలేదు. కేవలం ఆరోగ్య బీమాపై డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంచారు. ఇక సీనియర్‌ సిటిజన్లకు ఇది రూ.20 వేల నుంచి రూ.30వేలకు విస్త‌రించారు. దీంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు అల‌వెన్స్‌పై మినహాయింపును కూడా రూ.800 నుంచి రూ.1,600కు చేర్చింది. 

రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న వారిపై సర్‌ఛార్జిని 10శాతం నుంచి 12 శాతానికి చేర్చారు. ఈ బడ్జెట్‌లో సంపద పన్ను తొలగించి రెండు శాతం సర్‌ఛార్జిని విధించారు. అత్యంత సంపన్నుల పన్ను ఆదాయం రూ.కోటి దాటితే దీనిని విధించేలా నిబంధనలు పెట్టారు. 

2016 బడ్జెట్‌లో సెక్షన్ ‌87 ఏ కింద పన్ను రిబేట్‌ రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆదాయం రూ.5లక్షలు మించని వారికే వర్తిస్తుందనే నిబంధన పెట్టారు.  ఆదాయం పన్ను (ఐటీ) చట్టం సెక్షన్‌ 80జీజీ కింద చెల్లించే ఆద్దెను రూ.24వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. రూ. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్‌ఛార్జిని 15శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. దీంతోపాటు రూ.10లక్షలు దాటిన డివిడెండ్లపై 10శాతం ఆదాయం పన్ను వేశారు. 

2017లో ఈ బడ్జెట్‌లో ఆదాయం ఉన్న రూ. 2.5లక్షల నుంచి రూ.5లక్షల మధ్యలో ఉన్నవారికి పన్నును 10శాతం నుంచి 5శాతం చేశారు. దీంతో వారికి రూ.12,500 వరకు లబ్ధి చేకూరింది. ఐటీ చట్టం సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేట్‌ను కూడా 5,000 నుంచి రూ.2,500 చేశారు. వార్షికాదాయం రూ.3.5లక్షల వరకు ఉన్నవారికి ఇది వర్తిస్తుందన్నారు. దీంతోపాటు వార్షికాదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నవారిపై 10శాతం సర్‌ఛార్జిని విధించారు. 

2018లో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ల స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిని రూ.40వేలకు పెంచడంతో సామాన్యూడికి రూ.5,800 వరకు ప్రయోజనం సమకూరింది. అదే సమయంలో సీనియర్‌ సిటిజన్లకు ఆరోగ్య ఖర్చుల మినహాయింపును రూ.30వేల నుంచి రూ.50వేలకు చేర్చారు.

మరోపక్క బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపులపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క అప్పటికే ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్నుపై ఉన్న 3శాతం విద్యాసెస్ స్థానంలో నాలుగు శాతం విద్య,ఆరోగ్య సెస్సును విధించారు. రూ.లక్ష విలువ దాటిన దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధించారు. 

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జైట్లీ చికిత్స కోసం అమెరికాకు వెళితే, 2019లో కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యతరగతి వారిపై రూ.5లక్షల వరకు ఆదాయం పన్నుపై రిబేట్‌ ప్రకటించారు. 2019లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు. 

ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రెండో విడత బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2020లో రెండో వార్షిక బ‌డ్జెట్ స‌మ‌ర్పించిన నిర్మ‌ల‌మ్మ‌.. దీర్ఘ‌కాలంలో ఆదాయం ప‌న్ను రాయితీల‌ను పూర్తిగా తొల‌గించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

న్యూ ఆదాయం ప‌న్ను విధానం వ‌ల్ల మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ఆదా అవుతుంద‌ని, డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ టాక్స్ ర‌ద్దు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏక‌ధాటిగా 160 నిమిషాల సేపు బ‌డ్జెట్ ప్ర‌సంగం సాగించిన నేత‌గా నిలిచారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి సోమ‌‌వారం ప్ర‌వేశ‌పెడితే ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా నేత‌గా రికార్డు నెల‌కొల్పుతారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo