శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 13, 2020 , 00:49:31

మమ్మల్ని ఆదుకోండి

మమ్మల్ని ఆదుకోండి
  • బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండి
  • కేంద్రాన్ని కోరిన ఆటోమొబైల్‌ పరిశ్రమ

న్యూఢిల్లీ, జనవరి 12: రాబోయే బడ్జెట్‌లో ఆటోమొబైల్‌ రంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆటో పరిశ్రమ కోరింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత మందగమన పరిస్థితుల దృష్ట్యా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఆయా సంస్థలు సూచించాయి. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు, లిథియం ఇయాన్‌ బ్యాటరీ సెల్స్‌ దిగుమతులపై సుంకం రద్దు, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రోత్సాహకాలు వంటి వాటిని పరిశ్రమ ఆశిస్తున్నది. ముఖ్యంగా బీఎస్‌-6 వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కోత పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నది.

బీఎస్‌-6 రాకతో కాలుష్యం తగ్గుముఖం పడుతుందని, అయితే ఈ శ్రేణి వాహనాల తయారీకి 8 నుంచి 10 శాతం ఖర్చు పెరుగుతున్నదని ఆటో సంస్థలు చెబుతున్నాయి. కాబట్టి జీఎస్టీ తగ్గితే ఉపశమనం లభిస్తుందని, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అలాగే కొత్త వాహనాల కొనుగోళ్లకు ఊతమిచ్చేలా పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాలని, స్క్రాపింగ్‌ పాలసీ ఆధారిత ప్రోత్సాహకాలను ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత దారుణంగా గతేడాది వాహన విక్రయాలు పడిపోయిన విషయం తెలిసిందే.

ఆటో, దాని అనుబంధ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలూ పోయిన సంగతీ విదితమే. దీంతో పరిశ్రమ బతకాలంటే బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు తప్పనిసరి అని కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్యాసింజర్‌, ద్విచక్ర, వాణిజ్య వాహన అమ్మకాలు నిరుడు 13.77 శాతం క్షీణించాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ వెల్లడించింది. 2018లో 2 కోట్ల 67 లక్షల 58,787 యూనిట్ల విక్రయాలు జరిగితే, 2019లో 2 కోట్ల 30 లక్షల 73,438 యూనిట్లకే అమ్మకాలు పరిమితమైయ్యాయి. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, తగ్గిన వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ లేమి తదితర అంశాలు ఆటో రంగ అమ్మకాలను దెబ్బతీశాయి.

కస్టమ్స్‌ సుంకం తగ్గించాలి

అల్యూమినియం ఫ్లోరైడ్‌ తదితర కీలక ముడి సరుకులపై కనీస కస్టమ్స్‌ సుంకాన్ని వచ్చే బడ్జెట్‌లో తగ్గించాలని అల్యూమినియం పరిశ్రమ కోరుతున్నది. అధిక దిగుమతి సుంకాలు.. పరిశ్రమ పురోగతికి విఘాతం కలిగిస్తున్నాయని అల్యూమినియం అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ‘భారతీయ అల్యూమినియం పరిశ్రమలో పోటిని పెంచడానికి, సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కీలక ముడి సరుకులపై కనీస కస్టమ్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఏఏఐ తెలిపింది. విదేశాల నుంచి దేశంలోకి అల్యూమినియం తుక్కు దిగుమతి ఏటా పెరుగుతున్నదని, ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇప్పటిదాకా జరిగిన మొత్తం అల్యూమినియం దిగుమతుల్లో దాదాపు 58 శాతం తుక్కేనని ఏఏఐ వెల్లడించింది. ఫలితంగా రూ.17,200 కోట్ల విలువైన ఫారెక్స్‌ నిల్వలు బయటి దేశాలకు తరలిపోయాయని చెప్పింది. దిగుమతి సుంకం తగ్గితే కొంత ఊరట ఉంటుందని అభిప్రాయపడింది. మిలియన్‌ టన్ను బొగ్గుపై విధిస్తున్న రూ.400 సెస్సునూ తొలగించాలని కోరింది. అల్యూమినియం వంటి పరిశ్రమలకు ఇది ప్రోత్సాహకంగా ఉంటుందన్నది.


బీమా సంస్థలకు మరిన్ని నిధులు


ప్రభుత్వ రంగ జనరల్‌ బీమా సంస్థల కోసం రాబోయే బడ్జెట్‌లో మరో విడుత మూలధన సాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఆర్థికంగా పరిపుష్ఠం చేయాలని భావిస్తున్న కేంద్రం.. రెండోసారి మూలధనాన్ని అందించే వీలున్నది. ఇప్పటికే నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.2,500 కోట్ల సాయాన్ని మోదీ సర్కారు చేసింది. అయినప్పటికీ ఈ సంస్థలకు అదనంగా రూ.10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మూలధన అవసరాలున్నాయి.

ఈ క్రమంలో అందుకు తగ్గట్లుగా వచ్చే బడ్జెట్‌లో ప్రకటన ఉండవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేసి ఒకే పెద్ద సంస్థగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తున్నది. దీని విలువ రూ.1.2 లక్షల కోట్ల నుంచి 1.5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మార్చి 31, 2017 నాటికి ఈ మూడు సంస్థలు కలిసి 200లకుపైగా ఉత్పత్తులను విక్రయించాయి. మొత్తం ప్రీమియం విలువ రూ.41,461 కోట్లుగా ఉన్నది. మార్కెట్‌లో ఇది సుమారు 35 శాతానికి సమానం. ఈ సంస్థల ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లుగా ఉన్నది. వీటిలో దాదాపు 44 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటికి 6 వేలకుపైగా కార్యాలయాలున్నాయి. ఇక 2017లో ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.


logo