శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 18, 2021 , 17:39:13

హువావేకు చిప్‌ల స‌ర‌ఫ‌రాపై ట్రంప్ నిషేధం

హువావేకు చిప్‌ల స‌ర‌ఫ‌రాపై ట్రంప్ నిషేధం

న్యూయార్క్/వాషింగ్ట‌న్‌: ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ప‌ద‌వీ కాలం చివ‌రి ద‌శ‌లోనూ చెల‌రేగిపోతున్నారు. ఇటీవ‌ల మిలిటరీతో సంబంధాలు ఉన్నాయ‌న్న సాకుతో చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ జియోమీ త‌దిత‌ర సంస్థ‌ల‌పై నిషేధం విధించారు. తాజాగా చైనా టెక్ దిగ్గ‌జంగా పేరొందిన హువావేపై క‌న్నెర్ర చేశారు. బుధ‌వారం అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుండ‌గానే.. ట్రంప్ ఈ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. 

ఆదేశాలు నిజ‌మేన‌న్న సెమీ కండ‌క్ట‌ర్లు

చిప్‌ల‌తోపాటు స్మార్ట్‌ఫోన్లను త‌యారు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన విడిభాగాల‌ను హువావేకు స‌ర‌ఫ‌రా చేయొద్ద‌ని తాజాగా ట్రంప్ హుకుం జారీ చేసిన‌ట్లు స‌మాచారం.ప‌ద‌వీ కాలం ముగింపు ద‌శ‌లో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై చిప్ త‌యారీ సంస్థ ఇంటెల్ గానీ, అమెరికా వాణిజ్య మంత్రిత్వ‌శాఖ కానీ స్పందించ‌లేదు. హువావేకు అవ‌స‌ర‌మైన విడిభాగాల స‌ర‌ఫ‌రా విజ్ఞ‌ప్తుల‌ను నిరాక‌రించాల‌ని వాణిజ్య‌శాఖ త‌మ‌కు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంద‌ని సెమీ కండ‌క్ట‌ర్ ఇండ‌స్ట్రీ శుక్ర‌వారం తెలిపింది. అయితే, ఈ నోటీసుల‌పై స్పందించ‌డానికి సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌కు 20 రోజుల స‌మ‌యం ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యం అమ‌లులోకి రావ‌డానికి దాదాపు మూడు నెల‌ల టైం ప‌డుతుంది.  

హువావేకు 430 బిలియ‌న్ల డాల‌ర్ల దెబ్బ‌

ట్రంప్ తాజా ఆదేశాలు జారీ కాక‌ముందు 120 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన విడిభాగాల స‌ర‌ఫ‌రా కోసం హువావే దాఖ‌లు చేసిన ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి గాక‌, మ‌రో 280 బిలియ‌న్ డాల‌ర్ల సామ‌గ్రి, విడి భాగాలు, టెక్నాల‌జీ స‌ర‌ఫ‌రా కోసం హువావే.. అమెరికా కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ట్రంప్ తాజా ఆదేశాల‌తో హువావే ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. 

తొలి నుంచి హువావేపై ట్రంప్ మంట‌లు

తొలి నుంచి చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ హువావే ప‌ట్ల ట్రంప్ వ్య‌తిరేక ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు. అమెరికా భ‌ద్ర‌త‌కు ముప్పు పేరిట 5జీ టెక్నాల‌జీపై పేటెంట్లు సాధించిన స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ‌ హువావేను బ‌ల‌హీన‌ప‌రిచే వ్యూహాన్ని ట్రంప్ అమ‌లు చేస్తున్నారు. ప్ర‌పంచ దేశాల‌కు 5జీ టెక్నాల‌జీని అందుబాటులోకి తేవ‌డంలో అగ్ర‌గామిగా నిల‌వాల‌ని త‌ల‌పోస్తున్న‌ హువావేను ట్రంప్‌ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చారు. హువావే టెక్నాల‌జీ వ‌ల్ల డేటా దోపిడీకి గురవుతుందని ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ నేపథ్యంలో హువావేను బహిష్కరించాలన్న ట్రంప్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఆ సంస్థ‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ్రిట‌న్‌‌ రద్దు చేసుకుంది.

2018లో కెన‌డాలో హువావే సీఎఫ్ఓ అరెస్ట్‌

ఇంత‌కుముందు 2018 డిసెంబ‌ర్‌లో అమెరికా జారీ చేసిన వారంట్ మేర‌కు కెన‌డా ప్ర‌భుత్వం హువావే చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ మెంగ్ వాంగ్‌జూను అరెస్ట్ చేసింది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీల విష‌య‌మై హువావే బ్యాంకుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించింద‌ని అమెరికా ఆరోప‌ణ‌. మెంగ్ వాంగ్‌జూ.. హువావే వ్య‌వ‌స్థాప‌కుడు రెన్ జెంగ్‌ఫై కూతురు కూడా. మెంగ్ తాను అమాయ‌కురాలిన‌ని, వాదించారు. గూఢ‌చ‌ర్యం చేయ‌లేద‌ని పేర్కొంటూ.. నేరాభియోగాల‌ను అంగీక‌రించేందుకు మెంగ్ వాంగ్ జూ నిరాక‌రించారు. అమెరికా టెక్నాల‌జీ సంస్థ‌ల నుంచి వాణిజ్య ర‌హ‌స్యాల‌ను హువావే సేక‌రిస్తున్న‌ద‌ని, ఇరాన్ మీద విధించిన ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తున్న‌ద‌ని ట్రంప్ ప్ర‌భుత్వం అభియోగాలు మోపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo