శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 27, 2021 , 02:08:52

ఆకట్టుకోని స్టార్టప్‌లు

ఆకట్టుకోని స్టార్టప్‌లు

గతేడాది ఫండింగ్‌ రూ.75 వేల కోట్లే

న్యూఢిల్లీ, జనవరి 26: కరోనా సమయంలో దేశీయ స్టార్టప్‌లు ఓ మోస్తారు స్థాయిలోనే నిధులను ఆకట్టుకున్నాయి. గతేడాది మొత్తంగా 10.14 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్శించాయి. మన కరెన్సీలో ఇది రూ.75 వేల కోట్లేనని కన్సల్టింగ్‌ సంస్థ హెక్స్‌జెన్‌ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,200 ఒప్పందాలు జరిగినట్లు, వీటి విలువ 10 బిలియన్‌ డాలర్లకుపైగా ఉన్నదని పేర్కొంది. అంతక్రితం ఏడాది వచ్చిన 14.5 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే భారీగా తగ్గగా.. సంఖ్య పరంగా చూస్తే 20 శాతం అధికమని తెలిపింది. మరోవై పు, అంతర్జాతీయం గా ఉన్న స్టార్టప్‌లు 308 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించగా.. వీటిలో సగం అమెరికాకు చెందిన స్టార్టప్‌లవే 165 బిలియన్‌ డాలర్లు. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు సేకరించిన నిధుల్లో బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబైలకు చెందిన స్టార్టప్‌ల వాటా 90 శాతంగా ఉండటం గమనార్హం. ఈ-కామర్స్‌ రంగం అత్యధికంగా 3 బిలియన్‌ డాలర్లు ఆకట్టుకోగా..ఆ తర్వాత ఫిన్‌టెక్‌ (2.37 బిలియన్‌ డాలర్లు), ఈడీటెక్‌ (1.52 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. కంపెనీల వారీగా చూస్తే జోమాటో (1.02 బిలియన్‌ డాలర్లు), బైజుస్‌ (922 మిలియన్‌ డాలర్లు), ఫోన్‌పే (807 మిలియన్‌ డాలర్లు), యూఎన్‌ అకాడమీ (260 మిలియన్‌ డాలర్లు), ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌ (250 మిలియన్‌ డాలర్లు) టాప్‌లో ఉన్నాయి.

VIDEOS

logo