ఆదివారం 24 మే 2020
Business - Jan 21, 2020 , 01:43:40

అయ్యో.. జీడీపీ

అయ్యో.. జీడీపీ
  • నానాటికీ తగ్గిపోతున్న దేశ వృద్ధిరేటు అంచనాలు
  • 2019లో 4.8 శాతమేనన్న ఐఎంఎఫ్‌

దావోస్‌, జనవరి 20: ఆర్థిక మందగమనం, క్షీణించిన వినియోగ సామర్థ్యం, పడిపోతున్న పెట్టుబడులు, మార్కెట్‌ స్తబ్ధత.. భారత వృద్ధిరేటు ఉసురు తీస్తున్నాయి. దేశ జీడీపీ అంచనాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. గతేడాది 4.8 శాతాన్ని మించబోదని వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ (డబ్ల్యూఈవో)లో సోమవారం పేర్కొన్నది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, బలహీనపడిన గ్రామీణ ఆదాయ వృద్ధి వంటివి ఐఎంఎఫ్‌ అంచనాల కోతకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. నిజానికి నిరుడు అక్టోబర్‌లో భారత జీడీపీని 2019కి 6.1 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అయితే క్రమేణా దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులు వృద్ధిరేటు అంచనాలపై అపనమ్మకాన్ని పెంచాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలతోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), ప్రపంచ బ్యాంక్‌, చివరకు కేంద్ర ప్రభుత్వం సైతం జీడీపీ అంచనాలను తగ్గిస్తుండటం కలవరపెడుతున్నది. ఈ క్రమంలో ఐఎంఎఫ్‌ సైతం తమ అంచనాలను సవరించక తప్పలేదు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు దిగజారడం భారత జీడీపీకి ఇబ్బందిగా పరిణమించిందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఇబ్బందులూ వృద్ధిరేటును ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 5 శాతంగా ఉన్న భారత జీడీపీ.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో 4.5 శాతానికి పడిపోయి ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే.


ఈ ఏడాది మెరుగే

గతేడాది జీడీపీ పడకేసినా.. ఈ ఏడాది పుంజుకోవచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ క్రమంలోనే 2020కిగాను వృద్ధిరేటును 5.8 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో 6.5 శాతానికి పెరుగవచ్చని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు తగ్గింపు ఫలాలు అందవచ్చని గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలతో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడవచ్చని చెప్పారు. ఇక చైనా వృద్ధిరేటు 0.2 శాతం పెరిగి ఈ ఏడాది 6 శాతంగా ఉండొచ్చన్నారు. 


ప్రపంచ వృద్ధీ అంతంతే

2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.9 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ ఏడాది 3.3 శాతంగా, వచ్చే ఏడాది 3.4 శాతంగా ఉంటుందని చెప్పింది. 2019, 2020లో అంచనాలు గతంతో పోల్చితే ఒక శాతం తగ్గగా, 2021లో మాత్రం 2 శాతం తగ్గాయి. అర్జెంటీనా, ఇరాన్‌, టర్కీ వంటి దేశాల జీడీపీ బలపడవచ్చన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఐఎంఎఫ్‌ వ్యక్తం చేసింది. కాగా, సోమవారం ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ప్రారంభమవగా, దీనికి ముందే ఐఎంఎఫ్‌ ప్రపంచ దేశాల వృద్ధిరేటు అంచనాలను ప్రకటించింది. డబ్లూఈఎఫ్‌ సమావేశాలు ఐదు రోజులపాటు ఇక్కడ జరుగనున్నాయి. 


logo