ఆన్లైన్లో సలహాలు, సూచనలు
కరోనా నేపథ్యంలో వాట్సాప్‌లో సేవలు అందిస్తున్న టీచర్లు
దండేపల్లి, మే 25 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అంగన్వాడీ సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు అంగన్వాడీ సేవలు మరింత చేరువ చే సేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కేం ద్రాల ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇంటి వద్దకే విద్యను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల పరిధిలో లబ్ధిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పా టు చేసి స్మార్ట్ ఫోన్లోనే వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతున్నది.
ప్రీ స్కూల్ పిల్లలకు..
దండేపల్లి మండలంలో మొత్తం 66 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో నమోదైన చిన్నారులు ఇంట్లోనే ఆడుతూ, పాడుతూ నేర్చుకునేలా చిత్రాలు, పాటలు, పద్యాలు, తల్లుల ఫోన్లకు టీచర్లు పంపుతున్నారు. అనంతరం వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీ స్కూల్ పిల్లలకు ప్రత్యేకించి టీ శాట్ ద్వారా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నది. సులభంగా ఓ ఆంగ్ల పద్యాన్ని కూడా నేర్పిస్తున్నారు. ఆన్లైన్లో క్లాస్ వినని వారికి యూట్యూబ్ లింక్‌ను వాట్సాప్‌లో పంపిస్తున్నారు.
బాలింతలకు, గర్భిణులకు..
గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలు తగిన విశ్రాంతితో పాటు పౌష్టికాహారం తీసుకునేలా అంగన్వాడీ టీచర్లు చైతన్యం తీసుకొస్తున్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం గురించి ఫోన్లో వివరిస్తున్నారు. పోషకాహార లోపం ఉంటే కలిగే దుష్పరిణామాలు పోస్టర్ల మాదిరిగా తయారుచేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపుతున్నారు. ఐరన్ మాత్రలు వేసుకోవడం, ఆకు కూరలు, పాలు, గుడ్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా టీకాలు వేసుకోవడం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. సంబంధిత ఏఎన్ఎంలతో సమన్వయం చేసుకొని ఆరోగ్య సూచనలు అందిస్తున్నారు.
వాట్సాప్‌లోనే సలహాలు అందిస్తున్నాం..
ప్రస్తుత కరోనా సమయంలో చిన్నారులు విద్యకు దూరం కాకుండా ఆన్లైన్ ద్వారా వారికి విద్యను అందిస్తున్నాం. పేరెంట్స్ నంబర్లతో వాట్సాప్ గ్రూప్ తయారుచేసి పాఠాలు పంపుతున్నాం. అవసరమైనప్పుడు ఇంటికి వెళ్లి అంగన్వాడీ టీచర్లు సలహాలు కూడా అందిస్తున్నారు. బాలింతలకు, గర్భిణులకూ వాట్సాప్‌లో సలహాలు ఇస్తున్నాం. లబ్ధిదారులకు ఏమైనా సందేహాలుంటే టీచర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకుంటున్నారు. ప్రీస్కూల్ విద్యను ప్రోత్సహించడంలో అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.