మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 01, 2020 , 00:55:35

ఐబీఎం సీఈవోగా భారతీయుడు

ఐబీఎం సీఈవోగా భారతీయుడు

న్యూయార్క్‌, జనవరి 31: రోజుకొక కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ రంగాన్ని భారతీయులు శాసిస్తున్నడానికి మరో నిదర్శనం. ప్రపంచ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్ర వేస్తున్న భారతీయులు..మరో అగ్రగామి సంస్థయైన ఐబీఎంలో కీలక బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయనే అరవింద్‌ కృష్ణ. ఇదివరకే మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, అల్ఫాబెట్‌కు సుందర్‌ పిచాయ్‌, మాస్టర్‌ కార్డుకు అజయ్‌ బంగా, అడోబ్‌కు శంతను నారాయణ్‌లు నాయకత్వం వహిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి  అరవింద్‌ కృష్ణ చేరడం విశేషం. ఐఐటీ కాన్పుర్‌లో బీ.టెక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ నుంచి ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. శుక్రవారం సమావేశమైన బోర్డు కృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ నియామకం ఏప్రిల్‌ 6 నుంచి అమలులోకి రానున్నది. ప్రస్తుతం   క్లౌడ్‌ అండ్‌ కోగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ..ఐబీఎం సీఈవోగా పదవీ విరమణ చేయనున్న వర్జీనియా రోమెట్టి స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 2011 నుంచి  సీఈవోగా విధులు నిర్వహించిన రోమెట్టి..ఇక నుంచి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగనున్నారు.  1990లో ఐబీఎం లో చేరిన కృష్ణ.. న్యూయార్క్‌ కేంద్ర స్థానంగా పనిచేస్తున్న సంస్థలో పలు హోదాల్లో విధులు నిర్వహించారు.  లైనెక్స్‌ వంటి ప్రముఖ ఆపరేటింగ్‌ టెక్నాలజీని అందించిన రెడ్‌ హ్యాట్‌ను కొనుగోలు చేయడంలో కృష్ణ కీలకపాత్ర పోషించారు. 109 ఏండ్ల చరిత్ర కలిగిన ఐబీఎంలో ఇదొక కీలక మైలురాయి. ‘ఆశ్చర్యానికి గురయ్యాను.. ఐబీఎం నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా నియమితులవడం చాలా సంతోషంగా ఉన్నది.. గిన్ని, బోర్డులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని’ ఒక ప్రకటనలో కృష్ణ వెల్లడించారు. ఐబీఎంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని, టెక్నాలజీ పరంగా క్లయింట్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. 

 ఐబీఎం పదో సీఈవో..

వంద్లేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఐబీఎంకు అరవింద్‌ కృష్ణ పదో సీఈవో కావడం విశేషం. అంతకుముందు థామస్‌ జే వాట్సన్‌ (1914-1956), థామ స్‌ వాట్సన్‌ జూనియర్‌(1956-1971), టీ విన్సెంట్‌ లిర్‌సన్‌ (1971 -1973), ఫ్రాంక్‌ టీ.క్యారీ(1973-1981), జాన్‌ ఆర్‌ ఒపెల్‌ (1981-1985), జాన్‌ ఫెల్లో అకేర్స్‌ (1985- 1993), లూయిస్‌ వీ గెర్‌స్టానర్‌ జూనియర్‌(1993-2002), సామ్యుల్‌ జే పాల్‌మిశానో (2002-2011), గిన్ని రోమెట్టి (2011 నుంచి ప్రస్తుతం పని చేస్తున్నారు), అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థలకు నాయకత్వం వహిస్తున భారతీయుల్లో నాలుగోవాడు కృష్ణ. ఇదివరకే మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, గూగుల్‌కు సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌కు శంతను నారాయణ్‌ నాయకత్వం వహిస్తున్నారు.


logo
>>>>>>