గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 07, 2020 , 02:18:23

ఒక్కసారి చార్జింగ్‌తో 116 కిలోమీటర్లు

 ఒక్కసారి చార్జింగ్‌తో 116 కిలోమీటర్లు
  • దేశీయ మార్కెట్‌లోకి రాబోతున్న ఈ-స్కూటర్లు
  • ఐఐటీహెచ్, ప్యూర్ ఈవీల సంయుక్త తయారీ.. 9న లాంఛనంగా ప్రారంభం

కంది, నమస్తే తెలంగాణ: ఐఐటీ హైదరాబాద్-ప్యూర్ ఈవీలు సంయుక్తంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరల్లోనే ఇవి వాహనదారులకు లభించనున్నాయని సమాచారం. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 116 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటర్‌కు 25 నుంచి 30 పైసలు మాత్రమే కావడం గమనార్హం. ఐసీఏటీ, సీఎంవీఆర్‌ల నుంచీ ఇప్పటికే అనుమతి రాగా, ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు ఐఐటీ హైదరాబాద్ వేదిక కానున్నది. కాగా, ఈప్లూటో, ఈప్లూటో 7జి అనే రెండు వేరియంట్లలో ఈ మోడల్స్ పరిచయం అవుతున్నాయి. నిజానికి ప్యూర్ ఈవీ.. బ్యాటరీల తయారీ సంస్థ అయినప్పటికీ ఐఐటీ హైదరాబాద్ సహకారంతో రూ.350 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడానికి ముందుకు వచ్చింది. దేశంలోని మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా అందుబాటు ధరకే వీటిని అందించాలని సంస్థ భావిస్తున్నది. ఏటా దాదాపు 2 వేల స్కూటర్ల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశామని, డిమాండ్‌నుబట్టి ఇంకా పెంచుతామని అంటున్నారు. ఎక్స్ షోరూమ్ ధరను కూడా ఈ నెల 9న జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి నీతీ అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్‌లు విచ్చేయనున్నారు.


logo