బుధవారం 12 ఆగస్టు 2020
Business - Feb 13, 2020 , 00:29:39

చుక్కలో ధరలు

చుక్కలో ధరలు
  • జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పైకి
  • ఆరేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.59 శాతంగా నమోదు
  • భగ్గుమన్న కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రిటైల్‌ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. గతకొద్ది నెలలుగా క్రమేణా పెరుగుతున్న ధరలు.. జనవరిలో దాదాపు ఆరేండ్ల గరిష్ఠాన్ని తాకాయి. గత నెల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం ఐదున్నరేండ్లకుపైగా స్థాయికి ఎగిసి 7.59 శాతంగా నమోదైంది. 2014 మే తర్వాత ఇదే అత్యంత గరిష్ఠం. నాడు 8.33 శాతంగా ఉన్నట్లు బుధవారం ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక అంతకుముందు నెల డిసెంబర్‌లో 7.35 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో కేవలం 1.97 శాతంగానే ఉండటం గమనార్హం. కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, చేపల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో పలుకుతుండటం ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది. అయినప్పటికీ స్థూల ఆహార ద్రవ్యోల్బణం అంతకుముందుతో పోల్చితే జనవరిలో 13.63 శాతానికి తగ్గడం విశేషం.


ఇంతకుముందు 14.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. కూరగాయల ధరలు 50.19 శాతం, పప్పులు ఇతర ఆహారోత్పత్తుల ధరలు 16.71 శాతం, మాంసం, చేపల ధరలు 10.50 శాతం మేర పెరిగాయి. గుడ్ల ధరలు కూడా 10.41 శాతం ఎగిశాయి. ఆహార, శీతలపానియాల విభాగంలో ద్రవ్యోల్బణం 11.79 శాతంగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. ఇదిలావుంటే హౌజింగ్‌ 4.20 శాతం ఖరీదైందని, ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 3.66 శాతంగా ఉందని వివరించింది. కాగా, రాబోయే నెలల్లో కూరగాయలు ఇతర ఆహారోత్పత్తుల ధరలు తగ్గవచ్చని, ముఖ్యంగా మాంసం, గుడ్ల ధరలు దిగిరావచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే వివిధ రంగాల్లోని సేవలు ప్రియం కావడం కూడా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయంటున్నారు.


ద్రవ్యసమీక్షపై ప్రభావం..

నానాటికీ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్యసమీక్షను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే గత రెండు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లని విషయం తెలిసిందే. రెపో, రివర్స్‌ రెపోలను యథాతథంగా ఉంచింది. అంతకుముందు వరుసగా వీటిని తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ.. వృద్ధిరేటుకు ఊతమిచ్చే ప్రయత్నం చేసింది. కానీ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదని గ్రహించిన ఆర్బీఐ.. వడ్డీరేట్ల కోతలకు బ్రేకేసింది. నిజానికి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉంటే.. వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచాలి. కానీ దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ పని చేయలేకపోతున్నది. 
logo