బుధవారం 08 జూలై 2020
Business - Jun 03, 2020 , 23:56:39

కుదేలైన సేవా, ఉత్పాదక రంగాలు

కుదేలైన సేవా, ఉత్పాదక రంగాలు

  • ఐహెచ్‌ఎస్‌ సర్వే

న్యూఢిల్లీ, జూన్‌ 3: మాయదారి రోగం ముంచేసింది. కరోనా ధాటికి దేశంలోని అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన సేవల రంగం గత నెలలో దారుణంగా పడిపోయింది. వైరస్‌ కారణంగా వచ్చిపడిన లాక్‌డౌన్‌తో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోగా, ఉత్పాదక రంగం స్తంభించిపోయింది. దీంతో ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోతున్నాయని బుధవారం విడుదలైన సర్వేలో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా తెలిపింది. మే నెలలో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సేవలు, వ్యాపార కార్యకలాపాల సూచీ 12.6గానే నమోదైంది. ఏప్రిల్‌లో ఇది మునుపెన్నడూ లేనివిధంగా 5.4కే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ రంగ వ్యాపార కార్యకలాపాలు సైతం 14.8గానే ఉన్నాయి. ఏప్రిల్‌లో 7.2గా ఉన్నట్లు సర్వే తెలిపింది. 

లాక్‌డౌన్‌తో దుకాణం బంద్‌

లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు తెరుచుకోలేదని, కొన్ని వ్యాపారాలు సాగినా ఆర్థిక పరిస్థితులు దిగజారి వినియోగదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని ఐహెచ్‌ఎస్‌ సర్వే స్పష్టం చేసింది. డిమాండ్‌ లేక ఉత్పాదక రం గం కూడా మూతబడగా, ఉద్యోగ కోతలకు దారితీసిందని వెల్లడించింది. మున్ముందూ మరిన్ని కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐహెచ్‌ఎస్‌ హెచ్చరించింది. వైరస్‌ కట్టడిలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినది విదితమే. మే నెలలో సడలింపులను కేంద్రం ఇచ్చినా.. ఈ నెల నుంచే పూర్తిస్థాయిలో మార్కెట్‌ నడుస్తున్నది.

ప్రథమార్ధం పతనమే

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో ఆర్థిక వృద్ధిని భారీగా కోల్పోతామని ఐహెచ్‌ఎస్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 11 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.2 శాతానికి పరిమితమైనది తెలిసిందే. మొత్తానికి వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరిగితే తప్ప మార్కెట్‌ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


logo