మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 08, 2020 , 00:37:18

అమ్మో.. క్యాకరోనా!

అమ్మో.. క్యాకరోనా!
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాటేస్తున్న మహమ్మారి
  • సార్స్‌ వ్యాధితో కలిగిన నష్టం కంటే అధికం
  • ఈ ఏడాది 0.4 శాతం తగ్గనున్న ప్రపంచ జీడీపీ
  • చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే ప్రపంచానికే విపత్తు
  • ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: చైనాలో మొదలై వివిధ దేశాలకు శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాటేస్తున్నది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం 2003లో ‘సార్స్‌' వ్యాధి (సెవర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) ప్రబలినప్పుడు కలిగిన నష్టం కంటే ఎంతో అధికంగా ఉంటుందని, ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మందగించినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం పెను ఉప్పెనలా ఉంటుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ శుక్రవారం వెల్లడించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండవదిగా ఉన్న చైనాలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకోవడంతో ఆ దేశమంతటా పారిశ్రామిక, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. 


‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ దుష్ప్రభావం 2003లో ప్రబలిన సార్స్‌ వ్యాధి వల్ల కలిగిన నష్టం కంటే ఎంతో భారీగా ఉంటుంది. సార్స్‌ వ్యాధి ప్రబలినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో నిలువడంతోపాటు ప్రపంచ జీడీపీలో 4.2 శాతం వాటాను కలిగివున్న చైనా ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో 16.3 శాతం వాటాను కలి గి ఉన్నది. ఇలాంటి తరుణంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మందగించినా ఆ నష్టం ప్రపంచానికి పెను ఉప్పెనలా పరిణమిస్తుంది’ అని ఐహెచ్‌ఎస్‌ పేర్కొన్నది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు విస్తృతస్థాయిలో చేపడుతున్న చర్యలు ఈ నెలాఖరు వరకు కొనసాగి మార్చి ఆరంభంలోగా పురోగతి సాధించగలిగితే ప్రపంచ వాస్తవిక జీడీపీ 2020 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 0.8 శాతం మేరకు, రెండో త్రైమాసికంలో 0.5 శాతం మేరకు తగ్గడంతోపాటు 2020 సంవత్సరం మొత్తంమీద దాదాపు 0.4 శాతం వరకు తగ్గుతుందని ఐహెచ్‌ఎస్‌ వివరించింది.


పడకేసిన వాహన ఉత్పత్తి

ప్రస్తుతం చైనాలోని 11 రాష్ర్టాల్లో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉండటంతో సెలవులను పొడిగించారు. చైనాలో ఉత్పత్తయ్యే మొత్తం వాహనాల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ర్టాల్లోనే తయారవుతాయి. ఈ రాష్ర్టాల్లోని వాహన పరిశ్రమలు ఈ నెల 10 వరకు పనిచేయకపోయినా తొలి త్రైమాసికంలో ఉత్పత్తి దాదాపు 3.5 లక్షల యూనిట్ల మేరకు తగ్గుతుందని అంచనా. ఒకవేళ ఈ పరిస్థితి వచ్చేనెల మధ్యవరకు కొనసాగి పొరుగు రాష్ర్టాల్లోని పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి ఆగిపోతే వాహన విడిభాగాల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబెయి నుంచి సరఫరాలకు అంతరాయం ఏర్పడి చైనా వ్యాప్తంగా విడిభాగాల కొరత ఏర్పడి నష్టం మరింత అధికమవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో వాహనాల ఉత్పత్తి తొలి త్రైమాసికంలో 1.7 లక్షల యూనిట్లకుపైగా (కరోనా సంక్షోభానికి ముందున్న అంచనాల కంటే దాదాపు 32.3 శాతం) తగ్గవచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేసింది.


హాంకాంగ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రముఖ విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతున్న తమ సంస్థను కరోనా సమస్యలు కూడా చుట్టుముట్టడంతో 400 మంది సిబ్బందిని తొలిగించనున్నట్టు హాంకాంగ్‌ ఎయిర్‌లైన్స్‌ శుక్రవారం ప్రకటించింది. మిగిలిన సిబ్బందిని వేతనరహిత సెలవు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్టు తెలిపింది. హాంకాంగ్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇది రెండవది. మరోవైపు క్యాథే పసిఫిక్‌ కూడా తమ సంస్థలోని మొత్తం 27 వేల మంది సిబ్బందిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. కరోనా వైరస్‌ వల్ల ఆరోగ్య సంక్షోభం తలెత్తడంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్చి-జూన్‌ మధ్యలో వేతనరహిత సెలవు తీసుకోవాల్సిందిగా తమ సిబ్బందిని కోరామని క్యాథే పసిఫిక్‌ వెల్లడించింది.


logo
>>>>>>