బెంగళూరు: సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నుంచి కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది.
దీని వల్ల దేశంలోనే నాలుగో పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కెనరా బ్యాంకు అవతరించింది. కెనరా బ్యాంకులో విలీనమైనందున సిండికేట్ బ్యాంకు శాఖల్లో ఆన్లైన్ లావాదేవీలు, చెక్ లావాదేవీలు మారనున్నాయి.
ఇక నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను వినియోగించాలి. ఖాతాదారులు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను పొందేందుకు తమ బ్యాంక్ వెబ్‌సైట్‌ను గానీ (canarabank.com/IFSC.html), తమ బ్యాంక్ బ్రాంచ్‌ను గానీ ఖాతాదారులు సంప్రదించాలని కెనరా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లతో కూడిన చెక్ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. విదేశీ లావాదేవీలకు CNRBINBBFD స్విఫ్ట్ కోడ్‌ను వాడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని కెనరా బ్యాంక్ పేర్కొంది.