బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 16, 2020 , 23:35:47

వడ్డీరేట్ల కోతలు!

వడ్డీరేట్ల కోతలు!
  • కరోనా నేపథ్యంలో ఆర్బీఐ సంకేతాలు
  • యెస్‌ బ్యాంక్‌కు అండగా ఉంటాం: దాస్‌

ముంబై, మార్చి 16: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తామన్న సంకేతాలను ఇచ్చింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ). ఏప్రిల్‌ ద్రవ్య సమీక్షలో కోతలకు అవకాశాలున్నాయన్న రీతిలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్‌ మార్కెట్ల భారీ పతనం, యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం మధ్య సోమవారం దాస్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆర్థిక విపత్తులనైనా ఎదుర్కొనే సత్తా ఆర్బీఐకి ఉందన్నారు. అందుకు తగిన విధాన నిర్ణయాలు ఆర్బీఐ తీసుకోగలదని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితం ఏప్రిల్‌ 3న విడుదల కానున్నది. దీంతో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ డిమాండ్‌ చేస్తున్నది. కాగా, రెపో రేటును 5.15 శాతం వద్దే ఎందుకు ఉంచుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ అది మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయమన్నారు. ఇదిలావుంటే బ్యాలెన్స్‌ షీట్లు, ఆస్తులపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయాలంటూ బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూ చించింది. యెస్‌ బ్యాంక్‌కు ఆర్బీఐ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్న దాస్‌.. బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నదని వివరించారు. ఈ నెల 18 సాయంత్రం మారటోరియం ఎత్తివేస్తామన్నారు. ఇక 18నే రూ.25వేల కోట్ల కోసం 5 విడుత లాంగ్‌ టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ (ఎల్టీఆర్‌వో)ను చేపట్టనున్నది ఆర్బీఐ.


logo