బుధవారం 03 జూన్ 2020
Business - Apr 09, 2020 , 23:56:40

అంతా సర్దుకుంటుంది!

అంతా సర్దుకుంటుంది!

  • పరిస్థితులు అదుపులోకి వస్తే వృద్ధిరేటు మళ్లీ పరుగులు: ఆర్బీఐ

ముంబై, ఏప్రిల్‌ 9: అంతర్జాతీయ మందగమనం, దేశీయ లాక్‌డౌన్‌.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితులు చక్కబడితే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గురువారం ఆర్బీఐ తమ ద్రవ్య విధాన నివేదికను విడుదల చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తాము తీసుకుంటున్న ద్రవ్యపరమైన నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలను ఇవ్వగలవన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వెలిబుచ్చింది. ఈ కష్టకాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమన్న ఆర్బీఐ.. రబీ సీజన్‌లో అధిక దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచగలదని చెప్పింది. 

ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి: డబ్ల్యూటీవో

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నదని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీవో) హెచ్చరిక జారీ చేసింది. మునుపెన్నడు లేని  సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొక తప్పదని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయ వాణిజ్యం 13 శాతం నుంచి 32 శాతం వరకు పడిపోవచ్చునని వెల్లడించింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. 


logo