సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 00:18:12

ఐసీఐసీఐ బ్యాంక్‌ అదుర్స్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ అదుర్స్‌

  • రూ. 3,188 కోట్ల లాభాన్ని ఆర్జించిన సంస్థ

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలో ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.3,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. స్టాండలోన్‌ నికర లాభం గతంతో పోల్చితే 36 శాతం వృద్ధి చెంది రూ.2,599 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఏకీకృత ఆదాయం రూ.33,868.89 కోట్ల నుంచి రూ.37,939.32 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

గత త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 3.96 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 1.50 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంక్‌కు రూ.3,092.93 కోట్ల నిధులు సమకూరాయి. ఏడాది క్రితం 6.49 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 5.46 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ కూడా 1.77 శాతం నుంచి 1.23 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.7,593.95 కోట్ల నిధులను వెచ్చించింది. వీటిలో కరోనా వైరస్‌కు సంబంధించి రూ.5,550 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపింది. 


logo