గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:05:40

బోనస్‌లను ఇప్పించండి

బోనస్‌లను ఇప్పించండి
  • చందా కొచ్చర్ కేసులో బాంబే హైకోర్టుకు ఐసీఐసీఐ బ్యాంక్

ముంబై, జనవరి 13: చందా కొచ్చర్ నుంచి బోనస్ తదితర ప్రోత్సాహకాల సొమ్మును తిరిగి ఇప్పించాలని బాంబే హై కోర్టును ఐసీఐసీఐ బ్యాంక్ ఆశ్రయించింది. గతేడాది కొచ్చర్‌ను ఎండీ, సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్ తొలగించిన విషయం తెలిసిందే. వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణాల మంజూరులో అవకతవకల ఆరోపణలపై కొచ్చర్ తన పదవులకు రాజీనామా చేయగా, ఆ తర్వాత పలు విచారణల్లో ఆమె తప్పు చేసినట్లు తేలింది. దీంతో తనపై బ్యాంక్ వేటు వేసింది. ఈ క్రమంలోనే 2006 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు కొచ్చర్ సేవలను రద్దు చేసి ఆ సమయంలో ఆమె అందుకున్న బోనస్‌లను, ఇతరత్రా ప్రోత్సాహకాల ఆధారిత చెల్లింపులను బ్యాంక్‌కు ఇప్పించాలని ఈ నెల 10న బాంబే హైకోర్టులో ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యపరమైన పిటిషన్ దాఖలు చేసింది.

దుష్ప్రవర్తన, బ్యాంక్‌కు నష్టాన్ని కలిగించారన్న అభియోగాల కింద ఈ కేసును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ పిటిషన్‌లో కొచ్చర్ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలనీ బ్యాంక్ కోరింది. దీంతో ఈ కేసు విచారణను జస్టిస్ ఆర్వీ మోరే, జస్టిస్ ఎస్పీ టవడేలతో కూడిన ధర్మాసనం ఈ నెల 20కి సోమవారం వాయిదా వేసింది. అఫిడవిట్ ద్వారా ముందుకెళ్లాలని కొచ్చర్ తరఫు న్యాయవాది సుజయ్ కాంతవాలాకు సూచించింది. గతేడాది నవంబర్ 30న కొచ్చర్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.


logo