ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 05, 2020 , 02:07:16

హ్యుందాయ్‌ సేల్స్‌పర్సన్‌గా వీధి కుక్క

హ్యుందాయ్‌ సేల్స్‌పర్సన్‌గా వీధి కుక్క

బ్రెజిలియా, ఆగస్టు 4: బ్రెజిల్‌లోని ఓ హ్యుందాయ్‌ షోరూం యాజమాన్యం వీధి కుక్కను దత్తత తీసుకుని తమ సేల్స్‌పర్సన్‌గా నియమించుకున్నది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనికి టక్సన్‌ ప్రైమ్‌ అని పేరు పెట్టి ఐడీ కార్డును కూడా తగిలించారు. ఈ శునకం తరచూ షోరూం పరిసరాల్లోనే కనిపిస్తూ ఉండేది. ఉద్యోగులు బయటకు వస్తేచాలు వెంటే తిరిగేది. దీన్ని గమనించిన షోరూం నిర్వాహకులు చేరదీసి తమ గౌరవ ఉద్యోగిగా ప్రకటించారు. ఇప్పుడు టక్సన్‌ ప్రైమ్‌ ఇంటర్నెట్‌లో ఓ సంచలనం. హ్యుందాయ్‌ బ్రెజిల్‌ ఈ కుక్క ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది మరి. ‘ఇదిగో ఇది టక్సన్‌ ప్రైమ్‌. హ్యుందాయ్‌ ప్రైమ్‌ డీలర్‌షిప్‌ వద్ద సేల్స్‌ డాగ్‌. ఈ కొత్త సభ్యుడి వయసు దాదాపు ఏడాది. హ్యుందాయ్‌ కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం. ఇప్పటికే సహచర ఉద్యోగులు, మా కస్టమర్ల మన్ననలను పొందింది’ అని వెల్లడించింది. ఇక టక్సన్‌ ప్రైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 28వేల మంది అభిమానులు కూడా ఉన్నారు. ఈ కుక్క సమావేశాలకు హాజరైన ఫొటోలతోపాటు షోరూంలోకి వచ్చే కస్టమర్లను ఆహ్వానిస్తున్నవి, కార్లను చెక్‌ చేస్తున్నవి ఇలా ఎన్నో రకాల ఫొటోలను నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో వీటిని అంతా ఎగబడిమరి చూస్తున్నారిప్పుడు. టక్సన్‌ పేరుతో హ్యుందాయ్‌ కారున్న విషయం తెలిసిందే.


logo