సోమవారం 01 మార్చి 2021
Business - Jan 10, 2021 , 21:06:52

ఆపిల్‌తో కారు వెంచ‌ర్‌పై హ్యుండాయ్ యూట‌ర్న్‌

ఆపిల్‌తో కారు వెంచ‌ర్‌పై హ్యుండాయ్ యూట‌ర్న్‌

న్యూఢిల్లీ: ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ హ్యుండాయ్ విద్యుత్ కార్ల త‌యారీపై మాట మార్చింది. టెక్ దిగ్గ‌జం ఆపిల్‌తో క‌లిసి సెల్ఫ్ డ్రైవింగ్ ఎల‌క్ట్రిక్ కారు డెవ‌ల‌ప్‌చేయ‌డంపై హ్యుండాయ్ వివ‌ర‌ణ ఇచ్చింది. దీనిపై రెండు సంస్థ‌ల మ‌ధ్య ప్రాథ‌మిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి రెండుసార్లు హ్యుండాయ్ స్టేట్‌మెంట్‌ను స‌వ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

ప్ర‌తిష్ఠాత్మ‌క సెల్ఫ్ డ్రైవింగ్ విద్యుత్ కారు త‌యారీపై ఆపిల్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆటోమొబైల్ సంస్థ త‌మ‌దేన‌ని తొలి స‌వ‌ర‌ణ‌లో హ్యుండాయ్ పేర్కొంది. విద్యుత్ కారు డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఆపిల్‌తో చ‌ర్చ‌ల ప్ర‌స్తావ‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు రెండో వివ‌ర‌ణ‌లో వెల్ల‌డించింది. కుప‌రిటో ఎల్ల‌వేళ‌లా త‌మ ప్రాజెక్టుల్లో చాలా సీక్రేటివ్ అని పేర్కొంది. 

ఐదేళ్ల క్రిత‌మే ఆపిల్ విద్యుత్ కారు డెవ‌ల‌ప్‌మెంట్ చాలా ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని, విప‌ణిలోకి 2027లో ఆవిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే బ్యాట‌రీతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాల‌జీ గ‌ల విద్యుత్ కారును ఆపిల్‌, హ్యుండాయ్ క‌లిసి డెవ‌ల‌ప్ చేయ‌నున్నాయ‌ని ద‌క్షిణ కొరియా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రోవైపు ఆపిల్ యాజ‌మాన్యం కూడా కార్ల త‌యారీ విష‌య‌మై త‌మ‌కు అనుభ‌వం లేద‌ని, డీల‌ర్‌షిప్ నెట్‌వ‌ర్క్ లేద‌ని, ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఆటోమొబైల్ సంస్థ‌ల్లో ఒక‌దానితో టై-అప్ అవ్వాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆపిల్ తెలిపింది. అయితే, త‌మ పార్ట‌న‌ర్ ఎంచుకోవ‌డం చాలా తొంద‌ర‌పాట‌వుతుంద‌ని భావిస్తున్న‌ట్లు ఆపిల్ పేర్కొంది. రెండు సంస్థ‌ల మ‌ధ్చ చ‌ర్చ‌లు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నందునే హ్యుండాయ్.. బ్యాట‌రీతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ విద్యుత్ కారు డిజైన్‌పై ఆపిల్‌తో టై-అప్ విష‌య‌మై వెన‌క్కు త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. 

మ‌రోవైపు ఇప్ప‌టికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను డెవ‌ల‌ప్ చేయ‌డానికి జ‌న‌ర‌ల్ మోటార్స్‌తో క‌లిసి 400 కోట్ల డాల‌ర్ల జాయింట్ వెంచ‌ర్‌లో హ్యుండాయ్ భాగ‌స్వామిగా మారింది. 2025 నాటికి 10 ల‌క్ష‌ల విద్యుత్ కార్ల‌ను విక్ర‌యించాల‌ని హ్యుండాయ్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. ఎల‌క్ట్రిక్ అండ్ అటాన‌మ‌స్ వాహ‌నాల ప్రాజెక్టుల అమ‌లుకు వ‌చ్చే ఐదేండ్ల‌లో 5500 కోట్ల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లో భాగంగా జ‌న‌ర‌ల్ మోటార్స్‌తో హ్యుండాయ్ జ‌త క‌ట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo