ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 20, 2020 , 01:06:20

ఐపీవోకి ఎంటీఏఆర్‌ టెక్నాలజీ

ఐపీవోకి ఎంటీఏఆర్‌ టెక్నాలజీ

  • రూ.650 కోట్ల నిధుల సమీకరణలో హైదరాబాదీ సంస్థ

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంజినీరింగ్‌ సొల్యుషన్స్‌ సేవల సంస్థయైన ఎంటీఏఆర్‌ టెక్నాలజీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా  రూ.600-650 కోట్ల వరకు నిధులను సమీకరించే యోచనలో ఉన్నది. ఈ ఐపీవో ద్వారా కొత్తగా 40 లక్షల షేర్లను జారీ చేయనుండగా, వీటితోపాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు సంబంధించిన 82,24,270 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో విక్రయించనున్నారు. ఇలా సేకరించిన నిధులను రుణ చెల్లింపుల కోసం, దీర్ఘకాలికంగా వ్యాపార నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేక యూనిట్‌ 

దేశవ్యాప్తంగా ఏడు యూనిట్లను కలిగివున్న సంస్థకు హైదరాబాద్‌లో ఎగుమతుల కోసం ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పింది. తద్వారా రక్షణ, వైమానిక, ఇంధన రంగాలకు చెందిన కీలక పరికరాలను సరఫరా చేయనున్నది. నాలుగు దశాబ్దాలుగా ఇంజినీరింగ్‌ విభాగంలో సేవలు అందిస్తున్న సంస్థ..న్యూక్లియర్‌, వాటర్‌ రియక్టర్లు, ఏరోస్పేస్‌ ఇంజిన్‌, క్షిపణుల సిస్టమ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపొనెంట్‌తోపాటు ఇతర కీలక విడిభాగాలను తయారు చేస్తున్నది. ప్రస్తుతం సంస్థకు ఇండియన్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌, డిఫెన్స్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌, న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌, అమెరికాకు చెందిన బ్లూమ్‌ ఏనర్జీ కార్పొరేషన్‌లు క్లయింట్లుగా ఉన్నాయి. నవంబర్‌ నాటికి సంస్థ వద్ద రూ.356.50 కోట్ల విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. 

VIDEOS

logo