శనివారం 16 జనవరి 2021
Business - Nov 25, 2020 , 01:37:41

కార్వీపై వేటు

కార్వీపై వేటు

  • డిఫాల్టర్‌గా ప్రకటించిన ఎన్‌ఎస్‌ఈ

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌)పై జాతీయ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వేటు వేసింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఆ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించింది. అంతేకాకుండా స్టాక్‌ ఎక్సేంజీ సభ్యత్వం నుంచి బహిష్కరించింది. నిబంధనలను పాటించనందుకు కార్వీపై ఈ చర్య చేపట్టామని, ఇది ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చిందని ఎన్‌ఎస్‌ఈ ఓ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఖాతాదారుల అనుమతి లేకుండా వారి షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి రుణాలను పొందినట్టు కేఎస్‌బీఎల్‌ అభియోగాలను ఎదుర్కొంటున్నది. ఆ నిధులను కార్వీ గ్రూపు కంపెనీల్లోకి తరలించినట్టు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) తన విచారణ నివేదికలో వెల్లడించింది. నేరపూరిత ఉద్దేశంతో ఈ అక్రమాలకు పాల్పడేందుకు తొమ్మిది కంపెనీలను వాడుకున్నట్టు ఆర్వోసీ తెలిపింది. కొత్త బ్రోకరేజీ క్లయింట్లను చేర్చుకోరాదంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) గతేడాది నవంబర్‌లో కార్వీపై నిషేధం విధించింది. ఖాతాదారుల షేర్లను అక్రమంగా వాడుకుని రూ.2,000 కోట్లకుపైగా నిధులను దుర్వినియోగం చేసినట్టు కార్వీపై ఆరోపణలు రావడంతో సెబీ ఈ చర్య చేపట్టింది.