ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 00:00:02

భారత్‌లో భారీగా పెట్టుబడులు

భారత్‌లో భారీగా పెట్టుబడులు

  • రూ.75 వేల కోట్లు వెచ్చించనున్న గూగుల్‌
  • ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసినట్టు పిచాయ్‌ ప్రకటన
  •  ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌ సమావేశం
  • డిజిటల్‌ ఇండియా విజయవంతమైందని కితాబు

న్యూఢిల్లీ, జూలై 13: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ సిద్ధమైంది. దేశంలో డిజిటల్‌ టెక్నాలజీల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు రానున్న 5-7 ఏండ్లలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సోమవారం వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న పిచాయ్‌.. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ వార్షిక ఈవెంట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. 

భారత దేశ భవిష్యత్తుతోపాటు భారత డిజిటల్‌ ఎకానమీపై తమకున్న నమ్మకానికి ఈ పెట్టుబడులే నిదర్శనమన్నారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించేందుకు సంతోషిస్తున్నా. దీని ద్వారా భారత్‌లో దాదాపు 10 బిలియన్‌ డాలర్ల (రూ.75 వేల కోట్ల) పెట్టుబడులు పెడతాం. ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, నిర్వహణ తదితర రూపాల్లో ఈ పెట్టుబడులు సమకూరుస్తాం’ అని పిచాయ్‌ వివరించారు. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాలపై దృష్టిసారిస్తూ ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి భారతీయునికి తన సొంత భాషలో సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేసేందుకు, పరిశ్రమలు డిజిటల్‌ బాట పట్టేలా సహకరించేందుకు, సామాజిక హితం కోసం ఆరోగ్య, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో కృత్రిమ మేధస్సు  లాంటి ఆధునిక టెక్నాలజీలను వినియోగించేందుకు ఈ పెట్టుబడులను వెచ్చిస్తామన్నారు.

ప్రసార భారతి, సీబీఎస్‌ఈతో జోడీ

దూరదర్శన్‌లో ఎడ్యుటైన్‌మెంట్‌ సిరీస్‌ను ప్రారంభించేందుకు ప్రసార భారతితో కలిసి ఓ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పిచాయ్‌ ప్రకటించారు. ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన జరుపడంపై దేశంలోని కోటి మందికిపైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు సీబీఎస్‌ఈతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకొన్నట్టు తెలిపారు. అలాగే అల్పాదాయ వర్గాలకు చేయూతనిచ్చేందుకు గ్లోబల్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఫండ్‌లో భాగంగా కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ రూ.7.5 కోట్ల గ్రాంట్‌ను ఇవ్వనున్నట్టు సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు.

సవాళ్లతో అద్భుత ఆవిష్కరణలు

భారత్‌లో కొత్త తరం సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్నాయని, ఇకపై భారతీయులు సాంకేతికత కోసం ఎదురుచూడాల్సిన పనిలేదని చెప్పారు. కొత్తతరం ఆవిష్కరణలతో భారత్‌ లబ్ధిపొందేలా చూడటమే కాకుండా ఇలాంటి ఆవిష్కరణల్లో భారత్‌ ముందుండేలా చూసేందుకు గూగుల్‌ కట్టుబడి ఉన్నది’ అని పిచాయ్‌ స్పష్టం చేశారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం విజయవంతమైందని, వంద కోట్ల మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంలో దేశం గణనీయ పురోగతి సాధించిందని ఆయన కొనియాడారు.

రైతులు, యువత జీవితాల్లో నవోదయం

భారత రైతులు, యువజనుల జీవితాలను మార్చేందుకు సాంకేతిక శక్తిని వినియోగించుకోవడంతోపాటు డాటా భద్రతకున్న ప్రాధాన్యంపై ప్రధాని మోదీ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సోమవారం చర్చలు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో కొత్త పని సంస్కృతితోపాటు కరోనా సంక్షోభం నేపథ్యంలో విద్య, క్రీడా రంగాలకు ఎదురవుతున్న సవాళ్ల గురించి కూడా చర్చించినట్టు మోదీ ట్వీట్‌ చేశారు. ‘సోమవారం ఉదయం సుందర్‌ పిచాయ్‌తో అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిపా. అనేక అంశాలపై మేము మాట్లాడుకొన్నాం. దేశీయ రైతులు, యువజనులు, పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చేందుకు సాంకేతిక శక్తిని ఉపయోగించుకోడంపై ప్రధానంగా చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. 

పనీర్‌ మఖానీ కోసం..

దైనందిన జీవితంలో టెక్నాలజీ పోషిస్తున్న పాత్రను పిచాయ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. పనీర్‌ మఖానీ, పిజ్జా లాంటి వంటకాల తయారీ కోసం యూట్యూబ్‌ సాయాన్ని తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువుల పంపిణీ సేవలు అమూల్యమైనవని, ఇవి విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కూరగాయల కోసం బేరమాడే అవకాశాన్ని తన నానమ్మ కోల్పోయారని సుందర్‌ పిచాయ్‌ చమత్కరించారు.


logo