సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:08:09

హైదరాబాద్ హిట్

హైదరాబాద్ హిట్
  • గతేడాది కార్యాలయాల స్థలాలకు భారీ డిమాండ్
  • సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 13: హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలాలకు భలే గిరాకీ కనిపిస్తున్నది. ఆర్థిక మందగమనంలోనూ భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్‌కు గొప్ప డిమాండ్ వ్యక్తమవుతున్నది. గతేడాది దేశవ్యాప్తంగా 9 అగ్రశ్రేణి నగరాల ట్రెండ్‌పై ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ఆఫీసులను ఏర్పాటు చేయాలనుకునేవారే అధికమని తేలింది. 2018తో పోల్చితే 2019లో ఈ 9 నగరాల్లో స్థలాల లీజు 25 శాతం ఎగబాకింది. మునుపెన్నడూ లేనివిధంగా 61.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని సీబీఆర్‌ఈ స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్), ముంబై నగరాలు టాప్-4లో నిలిచాయి. ఇప్పటికే నైట్ ఫ్రాంక్ ఇండియా, జేఎల్‌ఎల్ ఇండియా సంస్థలు తమతమ రిపోర్టులను వెలువరించగా, 8 నగరాల్లో నిరుడు 27 శాతం పెరిగి 60.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలం లీజుకు పోయిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది.

ఇక జేఎల్‌ఎల్ ఇండియా 7 నగరాలపై అధ్యయనం చేయగా, గతంతో పోల్చితే 2019లో 40 శాతం ఆఫీస్ స్పేస్ గిరాకీ వృద్ధి చెందిందని, 46.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు కుదిరిందని చెప్పింది. విదేశాల్లోని బహుళజాతి సంస్థలు, దేశంలోని జాతీయ సంస్థలు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అమితాసక్తిని కనబరిచినట్లు సోమవారం సీబీఆర్‌ఈ వెల్లడించింది. గతేడాది జరిగిన మొత్తం లీజుల్లో బెంగళూరు, హైదరాబాద్, ఎన్‌సీఆర్, ముంబైల వాటానే దాదాపు 75 శాతంగా ఉన్నట్లు వివరించింది. వ్యాపారానికి అనువైన పరిస్థితులు, సంస్కరణల అమలు వంటివి ఈ నగరాల్లో ఆకర్షణీయంగా ఉండటమే ఇందుకు కారణమని సీబీఆర్‌ఈ ఇండియా ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాల చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ అన్నారు.


logo