గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 00:49:52

అమెరికాకు బ్రిటన్‌ షాక్‌

అమెరికాకు బ్రిటన్‌ షాక్‌
  • 5జీ సేవల కోసం హువావీకి అనుమతి

లండన్‌, జనవరి 28: అమెరికాకు బ్రిటన్‌ షాకిచ్చింది. తమ 5జీ నెట్‌వర్క్‌ నిర్మాణంలో హువావీ పాల్గొనేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ చైనా టెలికం దిగ్గజంపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా హువావీని అమెరికా దూరం పెట్టింది. హువావీపై నిషేధాజ్ఞలు అమల్లో పెట్టాలని తమ మిత్ర దేశాలనూ కోరింది. 


ఈ క్రమంలో హువావీకి మంగళవారం బ్రిటన్‌ పచ్చజెండా ఊపింది. కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులను ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 5జీ టెక్నాలజీ అమలుకు రంగం సిద్ధమవుతున్నది. డేటా ప్రాసెసింగ్‌లో వేగాన్ని, ఇంటర్నెట్‌ వినియోగంలో కస్టమర్లకు గొప్ప అనుభూతిని అందించడంలో 5జీ టెక్నాలజీ అత్యుత్తమం. భారత్‌లోనూ 5జీ సేవలు మొదలు కానుండగా, ట్రయల్‌ రన్‌లో పాల్గొనేందుకు గత నెల హువావీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. కాగా, తమ 5జీ నెట్‌వర్క్స్‌లో హువావీ ఎక్విప్‌మెంట్‌ను వినియోగించుకోవడానికి బ్రిటన్‌ టెలికం ఆపరేటర్లకు అనుమతినిచ్చిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం.. భద్రతాపరంగా కీలకమైన రంగాలకు మాత్రం హువావీ టెక్నాలజీ ప్రవేశానికి నో చెప్పింది.


బ్రిటన్‌పై అమెరికా అసంతృప్తి

మరోవైపు బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘5జీ సెల్యులార్‌ నెట్‌వర్క్‌ కోసం హువావీ టెక్నాలజీని వినియోగించుకునేందుకు బ్రిటన్‌ అంగీకరించడం సంతృప్తికరంగా లేదు’ అని ఓ ప్రకటనలో అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి. హువావీ రాక బ్రిటన్‌కు క్షేమదాయకం కాదని హెచ్చరించాయి. చైనా సర్కారు కనుసన్నల్లో పనిచేసే హువావీతో తమకు ముప్పు ఉంటుందనే దానిపై మేము నిషేధం విధించామని, ఏ దేశానికైనా ఈ తరహా ఇబ్బందే ఉండొచ్చని ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.


logo