మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 29, 2020 , 01:44:17

రాష్ట్రంలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ 320 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ 320 కోట్ల పెట్టుబడులు

  • రూ.220 కోట్లతో భువనగిరి వద్ద స్పెషాలిటీ గ్లాస్‌ ప్లాంట్‌
  • రూ.100 కోట్లతో సంగారెడ్డి ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రూ.320 కోట్ల పెట్టుబడులకు గ్లాస్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హిందుస్థాన్‌ శానిటరీవేర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఐఎల్‌) ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద గ్లాస్‌ ప్యాకేజింగ్‌ ఉత్పత్తిదారుగా ఉన్న హెచ్‌ఎస్‌ఐఎల్‌.. హిండ్‌వేర్‌ బ్రాండ్‌తో ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్‌ సొల్యూషన్స్‌ను మార్కెటింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో తమ వ్యాపార, ఉత్పాదక సామర్థ్య విస్తరణ దిశగా మరిన్ని పెట్టుబడులను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే స్పెషాలిటీ గ్లాస్‌ తయారీకి తమ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌లో రూ.220 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు తెలియజేసింది. భువనగిరి వద్ద నూతన గ్రీన్‌ఫీల్డ్‌ స్పెషాలిటీ గ్లాస్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2022 సెప్టెంబర్‌ ఆఖరుకల్లా ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుందని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.

150 టన్నుల ఉత్పాదక సామర్థ్యం

15 ఎకరాల విస్తీర్ణంలో ఐదు తయారీ లైన్లతో ఓ కొత్త ఫర్నేస్‌ను ఈ కేంద్రంలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ ఏర్పాటు చేస్తున్నది. రోజుకు 150 టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ స్పెషాలిటీ గ్లాస్‌ తయా రీ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఇక్కడి నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాదేశాలకు ఎగుమతి చేయడంపై సంస్థ దృష్టి సారించింది. ఔషధాలు, కాస్మటిక్స్‌, సెంట్‌, ఖరీదైన మద్యం ప్యాకేజీలకు స్పెషాలిటీ గ్లాస్‌ను విరివిగా వినియోగిస్తున్నారు.

సంగారెడ్డి ప్లాంట్‌ విస్తరణ

సంగారెడ్డిలోని ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్‌ (శానిటరీ ఉత్పత్తులు) సొల్యూషన్స్‌ తయారీ కేంద్రాన్ని హెచ్‌ఎస్‌ఐఎల్‌ విస్తరిస్తున్నది. రూ.100 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని ఇప్పుడున్న 30వేల టన్నుల నుంచి 48వేల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. 2022 సెప్టెంబర్‌ చివరి నాటికి ఈ విస్తరణ పనులు ముగుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

మరిన్ని ఉద్యోగావకాశాలు

తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి. ఇప్పటికే సనత్‌నగర్‌, భువనగిరిలలో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌కు ఒక్కో ఉత్పాదక కేంద్రం ఉన్నది. రోజుకు 1,600 టన్నుల కంటైనర్‌ గ్లాస్‌ తయారవుతున్నది. సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్స్‌ తయారీ ప్లాంట్‌ ఉండగా, తాజా పెట్టుబడులతో మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

‘స్పెషాలిటీ గ్లాస్‌ తయారీలోకి ప్రవేశిస్తుండటం చాలా సంతోషంగా ఉన్నది. ఇది మా గ్లాస్‌ ప్యాకేజింగ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయగలదని భావిస్తున్నాను. అలాగే ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్‌ సొల్యూషన్స్‌ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ప్రముఖ సంస్థగా ఎదిగాం. ఇప్పుడు వినియోగదారులకు ఇంకా దగ్గరయ్యేందుకు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతున్నాం’

-సందీప్‌ సోమని,

వైస్‌ చైర్మన్‌, ఎండీ, 

హెచ్‌ఎస్‌ఐఎల్‌ లిమిటెడ్‌