బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 30, 2020 , 12:15:52

ఐటీ రిట‌ర్న్స్ ఆల‌స్యంగా ఫైల్ చేస్తే జరిమానా ఎంతో తెలుసా?

ఐటీ రిట‌ర్న్స్ ఆల‌స్యంగా ఫైల్ చేస్తే జరిమానా ఎంతో తెలుసా?

మీ ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్‌ను ఫైల్ చేశారా?  చేయ‌క‌పోతే వెంట‌నే చేసేయండి. ఈసారి క‌రోనా కార‌ణంగా 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను రిట‌ర్న్స్ ఫైల్ చేసే గ‌డువును జులై 31 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ పొడిగించారు. ఇప్పుడు దాన్ని మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది  కేంద్రం. అంటే జనవరి 10లోపు మీరు మీ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తే ఓకే. లేదంటే జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

జ‌రిమానా పెరిగింది

ఐటీఆర్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫైల్ చేయ‌వ‌చ్చు. అయితే గ‌డువు తేదీ త‌ర్వాత రిట‌ర్న్స్ ఫైల్ చేస్తే ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 234ఎఫ్ కింద జ‌రిమానా విధిస్తారు. ఒక‌వేళ మీరు జ‌న‌వ‌రి 1, 2021న లేదా ఆ త‌ర్వాత ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తే రూ.10 వేల జ‌రిమానా చెల్లించాల్సి రావ‌చ్చు. ఈ పెనాల్టీ అనేది స‌ద‌రు వ్య‌క్తి సంపాద‌న, ఎప్పుడు ఫైల్ చేశార‌న్న‌దాని మీద ఆధార‌ప‌డి ఉంటుంది. గ‌తేడాది గ‌డువు తేదీ త‌ర్వాత కొన్ని నెల‌ల‌లోపు ఈ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తే రూ.5 వేలు మాత్ర‌మే జ‌రిమానా విధించారు.

వీరికి మిన‌హాయింపు

ఒక‌వేళ మీ ఆదాయం ప‌న్ను చెల్లించాల్సిన‌ ప‌రిమితి కంటే త‌క్కువ‌గా ఉంటే.. గ‌డువు తేదీ ముగిసిన త‌ర్వాత రిట‌ర్న్స్ ఫైల్ చేసినా ఎలాంటి జ‌రిమానా చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి 60 ఏళ్ల లోపు వారికి రూ.2.5 ల‌క్ష‌లు, 60 నుంచి 80 ఏళ్ల వారికి రూ.3 ల‌క్ష‌లు, 80 ఏళ్లు పైబ‌డిన వారికి రూ.5 ల‌క్ష‌లుగా ఉంది. రూ.5 ల‌క్ష‌ల‌లోపు ఆదాయం ఉండి నామ‌మాత్ర‌పు ప‌న్ను చెల్లించే వారికి ఈ జ‌రిమానా రూ.1000గా ఉంటుంది. రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ.10 వేలు ఫైన్ క‌ట్టాల్సిందే. 

ఫైనే కాదు వ‌డ్డీ కూడా

ఐటీ రిటర్న్స్ గ‌డువు మిస్ చేస్తే జ‌రిమానానే కాదు.. కొన్ని ఇత‌ర చ‌ర్య‌లూ ఉంటాయి. సెక్ష‌న్ 234ఏ ప్ర‌కారం ఎవ‌రైనా ప‌న్ను చెల్లించే వ్య‌క్తి గ‌డువు లోపు ఐటీ రిట‌ర్న్స్ స‌మ‌ర్పించ‌క‌పోతే.. అవి చెల్లించే వ‌ర‌కూ ప్ర‌తి నెలా చెల్లించ‌ని ప‌న్నుపై 1 శాతం వ‌డ్డీ క‌ట్టాల్సి ఉంటుంది. ఒక‌వేళ నోటీసులు అందుకున్న త‌ర్వాత కూడా కావాల‌నే రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌క‌పోతే సెక్ష‌న్ 276సీసీ కింద విచార‌ణ కూడా ఎదుర్కోవాల్సి రావ‌చ్చు. 


ఇవి కూడా చ‌దవండి

ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ పాయింట్లు.. అయినా రెండోస్థానం ఎందుకు?

చ‌రిత్ర‌లో తొలిసారి.. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు

గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌


VIDEOS

logo