బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 09, 2020 , 00:43:10

ఇంటి బడ్జెట్‌.. ఇల్లాలిదే

ఇంటి బడ్జెట్‌.. ఇల్లాలిదే
  • ఆర్థిక నిర్ణయాల్లో మహిళలదే పైచేయి
  • పొదుపు, కష్టార్జితాలపై అవగాహన ఎక్కువే
  • పెట్టుబడుల్లో మగువల దూకుడు
  • తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 8: ఒకప్పుడు వంటింటి కుందేలుగా అభివర్ణించబడిన మహిళలు.. ఇప్పుడు మొత్తం ఇంటి బాధ్యతల్నే తలకెత్తుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో ఇల్లాలిదే పైచేయిగా నిలుస్తున్నది. పొదుపు, కష్టార్జితాలపై వారిలో పెరిగిన అవగాహన.. ఇంటికి ఆర్థిక మంత్రులుగా చేసేసింది. పురుషులతో ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్న మగువలు.. అటు సంపాదన, ఇటు పెట్టుబడుల్లోనూ దూసుకుపోతున్నారు మరి. ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ స్క్రిప్‌బాక్స్‌ చేసిన అధ్యయనంలో పొదుపు, సంపాదన, పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాల్లో గృహిణుల హవా నడుస్తున్నట్లు తేలింది. తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలన్నదానిపై 68 శాతం మందికి మంచి అవగాహన ఉందని సర్వే స్పష్టం చేసింది. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లోనూ వారికి ఎంతో ప్రాధాన్యత పెరిగిందని, మగవారితో పోల్చితే వారి నిర్ణయాలే ఎక్కువని చెప్పింది. కేవలం 10 శాతం మందే మగవారికి ఆర్థిక నిర్ణయాలను వదిలేస్తున్నారు. గత నెలలో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 600లకుపైగా మహిళలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


బోర్డుల్లో ప్రాధాన్యం

కంపెనీల బోర్డుల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్నది. దేశంలోని చాలా సంస్థలు తమ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో స్త్రీల ప్రాధాన్యతను గుర్తించాయి. మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌, సర్కారీ-నౌక్రీ.ఇన్ఫో నిర్వహించిన ‘ఉమెన్‌ ఆన్‌ బోర్డ్‌ 2020’ అధ్యయనంలో భారత్‌ 12వ స్థానంలో నిలిచింది. భారత్‌సహా 36 దేశాల్లోని 7,824 స్టాక్‌ మార్కెట్‌ నమోదిత సంస్థల్లో సర్వేను చేపట్టారు. దేశంలో 628 కంపెనీలు సర్వేలో పాల్గొనగా, గతేడాది కంటే ఈసారి బోర్డ్‌లలో మహిళా డైరెక్టర్లను 14% పెంచామని చెప్పాయి.


ధైర్యంగా పెట్టుబడులు

నెలసరి పొదుపులపై క్రమశిక్షణతో ముందుకెళ్తున్న మహిళలు.. స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. 82% మంది తమ పెట్టుబడుల లక్ష్యాల సాధన కో సం స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. 43% మంది స్త్రీలు సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ల వైపు మొగ్గుతున్నారు. బంగారం పెట్టుబడులకూ 25% మంది సై కొడుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్‌ వేదిక గ్రో తెలిపింది. 26వేల మంది మహిళలతో ఈ సంస్థ సర్వేను చేపట్టింది. రిటైర్మెంట్‌ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పొదుపు చేస్తున్నారని పేర్కొన్నది.logo
>>>>>>