బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 11, 2020 , 17:37:24

రండి.. మా హోటల్ లో ఉచితంగా బస చేయండి..

రండి.. మా హోటల్ లో ఉచితంగా బస చేయండి..

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు మూతపడిన హోటళ్ళు, రెస్టారెంట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. లాక్డౌన్ సమయంలో పూర్తిగా మూసివేయడం వలన హోటల్ పరిశ్రమ భారీగా నష్టపోయింది. లాక్డౌన్ తెరిచిన తరువాత కూడా వ్యాధి వ్యాప్తికి భయపడుతున్న ప్రజలు హోటళ్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దాంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు పలు పెద్ద పెద్ద హోటళ్ళు వినియోగదారులను ఆకర్శించే పనిలో పడ్డాయి. కొన్ని హోటళ్లు డిస్కౌంట్లు ఇస్తుండగా.. మరికొన్ని హెటళ్లేమో ఉచితం హోటల్ బస కల్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. 

దేశంలోని చాలా పెద్ద హోటళ్ళ గ్రూపు అయిన ఐటీసీ.. తమ కస్టమర్లను ఆకర్షించడానికి.. సేవ్ నౌ, స్టే లేటర్ అనే పథకాన్ని కూడా తీసుకువచ్చింది. పర్యాటకులు, అతిథులు 2021 జూన్ వరకు ఏ రోజులోనైనా హోటల్ బుక్ చేసుకోవచ్చు, చెల్లింపు ముందస్తుగానే చెల్లించాలి. అయితే 2021 జూన్ లో కస్టమర్లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులకు 30 శాతం వరకు బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. 

అదేవిధంగా, మారియట్ హోటల్ కూడా ఇలాంటి పథకాన్నే తీసుకొచ్చింది. ఇందులో రెండు రాత్రులు బుక్ చేసుకునే వినియోగదారులు ఒక రాత్రికి మాత్రమే డబ్బు చెల్లించాలి. అలాగే, 2 రాత్రులు, 3 రోజులు బుక్ చేసుకునే వారు కూడా ఒక రాత్రికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. హోటల్ నుంచి ఇద్దరు వ్యక్తులకు కాంప్లిమెంటరీ అల్పాహారం అందిస్తారు.

ఇక తాజ్ హోటళ్లలో వినియోగదారులకు 4 డీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో అనేక సౌకర్యాలు, డిస్కౌంట్ పొందవచ్చు. ఇవేకాకుండా, రమడా గ్రూపుతో పాటు అనేక ఇతర పెద్ద హోటళ్ళు కూడా విభిన్న ఆఫర్లతో కస్టమర్లను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నాయి. రాడిసన్ హోటల్ ఆగస్టు 31 లోపు ఉంటున్న వారికి 25 శాతం తగ్గింపును కూడా అందిస్తున్నది.


logo