శుభవార్తః ఇంటి రుణాలపై ఎస్బీఐ వడ్డీరేట్లు తగ్గింపు

ముంబై: సొంతిల్లు కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్- భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇంటి రుణాలపై వడ్డీరేటు 30 బేసిక్ పాయింట్లు తగ్గించి వేసింది. అంతే కాదు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా మాఫీ చేసింది. అయితే వడ్డీరేట్ల తగ్గింపు ఎలా ఉందో తెలుసుకుందాం..
సిబిల్ స్కోర్‌కు అనుగుణంగా ఎస్బీఐ హోంలోన్ వడ్డీరేట్లు ఖరారవుతాయి. అదీ కూడా 6.80 శాతం వడ్డీ రేటు నుంచి రుణాల మంజూరు మొదలవుతుంది. రూ.30 లక్షల రుణాల వరకు 6.80 శాతం వడ్డీ అమలవుతుంది. కానీ రూ.30 లక్షలకు పైగా తీసుకున్న రుణాలకు 6.95 శాతం వడ్డీరేటు అమలు చేస్తారు. దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో ఇంటి రుణాలపై రూ. 5 కోట్ల వరకు వడ్డీరేటును ఎస్బీఐ 30 బేసిక్ పాయింట్లు తగ్గించివేసింది.
ఇప్పటికే హోంలోన్ తీసుకున్న వారు కూడా పేపర్‌లెస్ ప్రీ అప్రూవ్డ్ టాప్ అప్ హోంలోన్ తీసుకోవచ్చు. అంతే కాదు తమ కస్టమర్లు యోనో యాప్ వినియోగిస్తున్నట్లయితే ఐదు బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గుతాయి. ఐదు బేసిక్ పాయింట్ల రాయితీని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కూ వర్తింపజేస్తున్నది. మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.
ఎస్బీఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం ఎండీ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. 2021 మార్చి నెలాఖరు వరకు ఇంటి రుణాలపై రాయితీలను మెరుగుపరుస్తున్నాం. ఇల్లు కొనుగోలు దారులు విశ్వాసంతో ఇల్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడానికి తమ రాయితీ ప్రోత్సాహాన్నిస్తుందని మేం భావిస్తున్నాం అని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.