మాడ్రిడ్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పలు దేశాలు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయి. మరోసారి లాక్డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యే పరిస్థితులు నెలకొనడంతో ఉద్యోగాలు, వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వాలు వినూత్న పద్ధతులను అన్వేషిస్తున్నాయి. వారానికి నాలుగు రోజుల పని పద్ధతిని యూరప్‌లో తొలిసారిగా స్పెయిన్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ రికవరీ నిధి నుంచి ఈ మేరకు వారానికి నాలుగు రోజుల పనికి కంపెనీలను సిద్ధం చేసేందుకు భారీగా వెచ్చిస్తున్నారు. ఈ ప్రక్రియకు అనుగుణంగా సిబ్బందిని సర్ధుబాటు చేయడం, వారానికి 32 గంటల పని షెడ్యూల్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి, కార్మిక శక్తిని రీఆర్గనైజ్ చేసేందుకు కసరత్తు సాగుతోంది.
వారానికి నాలుగు రోజుల పనిదినాల అమలుకు యజమానులు వెచ్చించే అదనపు వ్యయాలను తొలి ఏడాది కరోనా రికవరీ నిధి నుంచి పూర్తిగా సమకూరుస్తారు. ఇక ఆపై ఏటా ప్రభుత్వ సాయాన్ని వరుసగా 50 శాతం, 25 శాతానికి తగ్గిస్తారని వారానికి నాలుగు రోజుల పని ప్రతిపాదనను ముందుకు తెచ్చిన మాస్పైస్ ప్రోగ్రెసివ్ పార్టీ విడుదల చేసిన బ్లూప్రింట్ పేర్కొంది. పూర్తి స్ధాయి వేతనాలను కొనసాగిస్తూనే నికర పనిగంటల తగ్గింపే లక్ష్యంగా ఈ సర్ధుబాటు చేపట్టాలని మాడ్రిడ్ ప్రాంతీయ అసెంబ్లీకి ప్రాతినిధ్య వహించే మాస్పైస్ పార్టీ ఎంపీ హెక్టర్ తెజెరో స్పష్టం చేశారు. వారానికి నాలుగు పని దినాలతో తాము ఉత్పాదకత పెంచుకుంటూ తమ కంపెనీల పోటీతత్వాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూడాలని చెప్పుకొచ్చారు.
వారానికి నాలుగు రోజుల పని పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు ఉత్పాదకత పెరిగేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. మరోవైపు మారిన పని పద్ధతులు ఆర్థిక వ్యవస్ధకూ ఊతమిస్తాయని ఈ ప్రక్రియను సమర్ధిస్తున్న నిపుణులు చెబుతున్నారు. మూడు రోజుల భారీ వారాంతంతో వినియోగం పెరుగుతుందని, స్పెయిన్ ఆర్థిక వ్యవస్ధకు వెన్నెముక వంటి వాణిజ్య వినోద రంగాలు భారీ వృద్ధిని నమోదు చేస్తాయని వారు అంచనా వేస్తున్నారు.
2017లో పనిగంటలను 40 నుంచి 35 గంటలకు తగ్గించగా జీడీపీ 1.5 శాతం వృద్ధి చెందిందని 5,60,000 కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని వారు గుర్తుచేస్తున్నారు. అయితే వారానికి నాలుగు రోజుల పనిదినాలకు అందరూ ఆమోదం తెలపలేదు. కన్జర్వేటర్లు దీనిపై నోరుమెదపకపోవడంతో పాటు స్పానిష్ వాణిజ్య సంస్థ సీఈఓఈ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబరచడం లేదు.