సోమవారం 30 మార్చి 2020
Business - Jan 23, 2020 , 00:11:32

హెచ్‌ఎఫ్‌ఎల్‌కు గుడ్‌బై

హెచ్‌ఎఫ్‌ఎల్‌కు గుడ్‌బై
  • మూసివేతకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, జనవరి 22: హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌)ను మూసేయాలన్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)లో ప్రస్తుతం 88 మంది ఉద్యోగులే ఉన్నారు. ‘హెచ్‌ఎఫ్‌ఎల్‌ మూసివేతకు సీసీఈఏ అనుమతినిచ్చింది. కెమికల్స్‌, పెట్రోకెమికల్స్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తున్నది’ అని  కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 2013-14 నుంచి హెచ్‌ఎఫ్‌ఎల్‌ నష్టాల్లో నడుస్తున్నది. 


సంస్థ విలువ రుణాత్మకంలోకి వెళ్లిపోయింది. మార్చి 31, 2019 నాటికి సంస్థ నష్టాలు రూ.62.81 కోట్లుగా ఉన్నాయి. నికర విలువ మైనస్‌ రూ.43.20 కోట్లకు దిగజారింది. మునుపటి బోర్డ్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కన్‌స్ట్రక్షన్‌ (బీఐఎఫ్‌ఆర్‌)లో ఇది ఖాయిలా పరిశ్రమగా నమోదైంది కూడా. ఇదిలావుంటే మూసివేత ప్రక్రియకు ఆర్థిక చిక్కులు తలెత్తనున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు, బకాయిలు, వీఆర్‌ఎస్‌/వీఎస్‌ఎస్‌ అమలు, ఎస్బీఐ వర్కింగ్‌ క్యాపిటల్‌ క్రెడిట్‌, పాలనాపరమైన ఖర్చులు వంటి వాటి కోసం సంస్థకు కనీసం రూ.77.20 కోట్లు అవసరం అవుతాయని అంచనా.


ఇప్పటికే సంస్థ నష్టాల్లో ఉన్నందున, నికర విలువ సైతం మైనస్‌లో కనిపిస్తున్నందున ఈ మొత్తాన్ని వడ్డీ రహిత రుణంగా కేంద్రమే సమకూర్చాల్సి వస్తున్నది. ఇక హెచ్‌ఎఫ్‌ఎల్‌ మూసివేత ప్రక్రియ రెండేండ్లు పట్టవచ్చని సమాచారం. వడ్డీ రహిత రుణం వసూలుకు సంస్థ భూములు, ఇతరత్రా ఆస్తులను విక్రయించాల్సి వస్తున్నది. మొత్తం అమ్మినా అప్పు తీరకపోతే మిగతాది రద్దు చేయవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. సంస్థకు చెందిన ప్లాంట్లు, టెక్నాలజీ పాతబడిపోవడంతో వాటి విలువ చాలావరకు తగ్గిపోయింది.


logo