శుక్రవారం 05 జూన్ 2020
Business - May 14, 2020 , 01:40:00

హైదరాబాద్‌లో రెమ్డిసివిర్‌!

హైదరాబాద్‌లో రెమ్డిసివిర్‌!

  • కరోనా చికిత్సలో కీలకంగా యాంటీవైరల్‌ ఔషధం
  • ఉత్పత్తి, పంపిణీ కోసం గిలీడ్‌తో హెటిరో ఒప్పందం
  • త్వరలోనే ఔషధాన్ని తీసుకొచ్చేందుకు దోహదం
  • ఐసీఎమ్మార్‌ నుంచి అనుమతి పొందగానే ఉత్పత్తి
  • హెటిరో గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ పార్థసారథిరెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం ‘రెమ్డిసివిర్‌' ఇకపై హైదరాబాద్‌లోనూ తయారుకానున్నది. ఈ ఔషధ తయారీ, పంపిణీ కోసం హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌.. అమెరికా సంస్థ గిలీడ్‌ సైస్సెస్‌తో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. కరోనా వైరస్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న రెమ్డిసివిర్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది. ఈ ఒప్పందం ద్వారా గిలీడ్‌ నుంచి సాంకేతికత బదిలీ అవుతుంది. రెమ్డిసివిర్‌ ఔషధాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, వివిధ దేశాల నియంత్రణ సంస్థల ఆమోదంతో దీని ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) నుంచి అనుమతి పొందిన వెంటనే హైదరాబాద్‌లో ఈ రెమ్డిసివిర్‌ను తయారుచేయనున్నట్టు హెటిరో సంస్థ ప్రకటించింది. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో భారత్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరట కల్పించేలా గిలీడ్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషదాయకమని హెటిరో గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బీ పార్థసారథిరెడ్డి తెలిపారు. గిలీడ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం సిప్లా సంస్థ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ)ను తయారుచేసి అంతిమ ఉత్పత్తిని అదే బ్రాండ్‌ పేరిట 127 దేశాల్లో విక్రయించనున్నది.

గిలీడ్‌తో మరో మూడు కంపెనీలు ఒప్పందం

రెమ్డిసివిర్‌ ఉత్పత్తి, పంపిణీ కోసం హెటిరోతోపాటు మైలాన్‌ సంస్థ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, నోయిడాలోని జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ కూడా గిలీడ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా నాలుగు దేశీయ ఫార్మా కంపెనీలతోపాటు పాకిస్థాన్‌కు చెందిన ఫిరోజ్‌సన్స్‌ ల్యాబొరేటరీస్‌ కూడా గిలీడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ ఒప్పందాలు ఎక్కువకాలం కొనసాగితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌, పాక్‌ భారీస్థాయిలో ఔషధాలను అందజేయగలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

గతంలోనూ భారత కంపెనీలతో గిలీడ్‌ జోడీ

రెమ్డిసివిర్‌పై గిలీడ్‌ సైన్సెస్‌కు దాదాపు 70 దేశాల్లో 2,031 వరకు పేటెంట్లు ఉన్నాయి. గిలీడ్‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారానే ఇతర కంపెనీలు ఈ ఔషధాన్ని తయారుచేయడం సాధ్యమవుతుంది. గతంలో స్వైన్‌ఫ్లూ ప్రబలినప్పుడు కూడా ఆ వ్యాధిని అదుపుచేసే ‘ఒసెల్టామివిర్‌' ఔషధ తయారీ కోసం భారత్‌కు చెందిన మూడుకంపెనీలను ‘వాలంటరీ లైసెన్స్‌' పద్ధతిలో గిలీడ్‌ భాగస్వాములుగా చేర్చుకున్నది. ఇప్పుడు రెమ్డిసివిర్‌ ఉత్పత్తి విషయంలో కూడా గిలీడ్‌ అదే పద్ధతిని అనుసరిస్తున్నది.


logo