గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 19, 2020 , 00:26:11

ఏడేండ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి

ఏడేండ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి
  • హీరో మోటోకార్ప్‌ సీఎండీ పవన్‌ ముంజల్‌

జైపూర్‌, ఫిబ్రవరి 18: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్‌..వచ్చే ఐదు నుంచి ఏడేండ్ల కాలంలో రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌ తెలిపారు. విజన్‌ 2020లో భాగంగా వచ్చే పదేండ్లకాలంలో కాలుష్య రహిత వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించిన ఆయన..ఇందుకు వచ్చే ఐదు నుంచి ఏడేండ్లకాలంలో సుస్థిరమైన రవాణా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 


హీరో నుంచి విడిపోయిన తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు నూతన ప్లాంట్‌ను, యంత్రాలు, వాహనాల అభివృద్ధికోసం రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు, వీటితోపాటు ఆర్‌అండ్‌డీ కోసం మరో 600 మిలియన్‌ డాలర్లు నిధులు వెచ్చించినట్లు చెప్పారు. 1985లో దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన సంస్థ ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల మైలురాయికి చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మరోవైపు సంస్థ దేశీయ మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన గ్లామర్‌, ప్యాషన్‌ ప్రొ బైకులను బుధవారం విడుదల చేసింది. వీటిలో గ్లామర్‌ మోటర్‌సైకిల్‌ రూ.68,900 నుంచి రూ.72 వేల మధ్యలో లభించనుండగా, ప్యాషన్‌ ప్రొ మాత్రం రూ.64,990 నుంచి 67,190 మధ్యలో నిర్ణయించింది. వీటితోపాటు వచ్చే నెలలో అందుబాటులోకిరానున్న ప్రీమియం బైకు ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ను ప్రదర్శించింది కూడా. 


logo