శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 28, 2020 , 00:44:34

డ్రోన్లకు భారీ డిమాండ్‌

డ్రోన్లకు భారీ డిమాండ్‌

  • దేశంలో ఉన్నవి 200.. డిమాండ్‌ 2,200 
  • మార్కెట్‌ విలువ రూ.600 కోట్లకు పైగా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో డ్రోన్లకు దేశవ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్నది. ప్రజాభద్రత, నిఘా, సమాచార వ్యవస్థ, వైద్య పరికరాల పంపిణీ, క్రిమిసంహారకాల పిచికారి.. ఇలా బహుళ ప్రయోజనాల కోసం డ్రోన్ల వినియోగం అధికమైంది. కరోనా కట్టడిలో కీలకమైన థర్మల్‌ కెమెరాలున్న డ్రోన్ల వినియోగం దేశంలో పెరుగుతున్నది. కొవిడ్‌-19 నియంత్రణకు భారతదేశంలో ప్రతిజిల్లాకు మూడు డ్రోన్లు అయినా అవసరమవుతున్నవి. 730కిపైగా జిల్లాలున్న దేశంలో 2,200 డ్రోన్లు అవసరం. కానీ, మన దగ్గర 200 మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కనీసం రెండు లక్షల డ్రోన్లకు డిమాండ్‌ ఉన్నదని వ్యాపారవర్గాల అంచనా. అందుకే, ఈ విభాగంలో ఎంతలేదన్నా రూ.600 కోట్ల మార్కెట్‌ ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ మార్కెట్లోనూ డ్రోన్లు దొరుకుతున్నాయని సమాచారం. తెలంగాణలో కరోనా కట్టడికి కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మనుషుల శరీర ఉష్ణోగ్రతల పర్యవేక్షణకు కూడా డ్రోన్లకు థర్మల్‌ కెమెరాలు బిగించి వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించేవారిని నియంత్రించడానికి మనరాష్ట్రంతోపాటు కేరళ, పంజాబ్‌లో డ్రోన్లను విరివిగా వాడుతున్నారు. నిషేధిత ప్రాంతాల్లో ప్రజల కదలికలను గమనిస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డ్రోన్ల వాడకం అనుమతి విధానాన్ని కేంద్రం సులభతరంచేయాలని వ్యాపారవర్గాలు కోరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు తిరుగుతూ నిఘా పెట్టడం కంటే ఎక్కువ దూరాన్ని డ్రోన్లు కవర్‌చేస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ల వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి.


logo