శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 28, 2020 , 00:47:27

ఆరోగ్య బీమా మరింత భారం!

ఆరోగ్య బీమా మరింత భారం!

  • 25 శాతం వరకు పెరిగే అవకాశం

ఆరోగ్య పాలసీలు తీసుకున్నారా.. అయితే మీరు మరింత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  కరోనా వైరస్‌తో ఆరోగ్య బీమా పాలసీల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. వీటికి అనుగుణంగా పాలసీదారులకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్న బీమా సంస్థలు.. తమ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలకు బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ కూడా అనుమతినిచ్చింది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే అక్టోబర్‌ 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం 5 శాతం నుంచి 25  శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ప్రీమియం నిర్ణయం బీమా సంస్థలకే

పాలసీల్లో పలు మార్పులు చేయడానికి సిద్ధమైన బీమా సంస్థలు.. ప్రీమియం పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎంతమేర పెంచాలనేదానిపై బీమా సంస్థలే నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌లు ఆరోగ్య పాలసీల ప్రీమియాన్ని 5 శాతం వరకు పెంచాయి. మిగతా సంస్థలు కూడా రెడీ అవుతున్నాయి.  మరోవైపు కొత్తగా వచ్చే పాలసీలు దీర్ఘకాలిక రోగాలకు వర్తించేలా పాలసీలను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం బీమా కవరేజ్‌ లేని అల్జీమర్స్‌, పార్కిన్సన్‌, ఎయిడ్స్‌ కూడా బీమా పరిధిలోకి రానున్నాయి.