సోమవారం 30 మార్చి 2020
Business - Jan 28, 2020 , 00:14:29

హెచ్‌డీఎఫ్‌సీ అదరహో..

హెచ్‌డీఎఫ్‌సీ అదరహో..
  • క్యూ3లో నాలుగింతలైన లాభం
  • రూ.8,372.50 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ, జనవరి 27: తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థయైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.8,372.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.2,113.8 కోట్లతో పోలిస్తే నాలుగింతలు అధికమైంది. హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థయైన గృహ ఫైనాన్స్‌ను బంధన్‌ బ్యాంక్‌లో విలీనం చేయడంతో బ్యాంక్‌లో సంస్థ వాటా 9.9 శాతం పెరిగింది.  సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 24, 653.15 కోట్ల నుంచి రూ.29,073. 19 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.  తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల  లున్‌ బుక్‌కు చేరుకున్నట్లు కంపెనీ వైస్‌ చైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెకి మిస్త్రీ తెలిపారు. వీటిలో వ్యక్తిగత రుణాలు 24 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, మొత్తం రుణాల్లో 14 శాతం పెరిగాయని ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. 


మార్కెట్లలో నెలకొన్న ప్రతిష్ఠంభన, వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో గత త్రైమాసికానికిగాను సంస్థ స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.5,950 కోట్లు లేదా 1.36 శాతంగా నమోదయ్యాయి. గత త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడెక్సిసీ రేషియో 18.6 శాతం గా ఉన్నాయి.  మొండి బకాయిలను పూ డ్చుకోవడానికి సంస్థ రూ.2,995 కోట్ల నిధులను వెచ్చించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.116 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. రెండో త్రైమాసికంలోనూ సంస్థ రూ.754 కోట్ల నిధులను కేటాయించింది. సంస్థ ఒక నెలలో సరాసరిగా 9,400 చౌక గృహ రుణాలను అందిస్తున్నది. సరాసరిగా వ్యక్తిగత రుణాల పరిమితి రూ.27.2 లక్షల నుంచి రూ.26.9 లక్షలకు తగ్గాయి.  స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.25 శాతం తగ్గి రూ.2,395.80 వద్ద నిలిచింది. 


logo