శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 19, 2020 , 00:25:29

ఆకట్టుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

 ఆకట్టుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
  • -మూడో త్రైమాసికంలో రూ.7,417 కోట్ల లాభం
  • -రూ.36 వేల కోట్లకు చేరిన బ్యాంక్‌ ఆదాయం

న్యూఢిల్లీ, జనవరి 18: ప్రైవేట్‌గా రుణాలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధి నమోదైంది. వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు భారీగా పెరుగడంతో డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.7,416.50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే త్రైమాసికానికిగాను వచ్చిన రూ.5,585.90 కోట్ల లాభంతో పోలిస్తే 32.8 శాతం వృద్ధి కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.30,811.27 కోట్ల నుంచి రూ. 36,039 కోట్లకు ఎగబాకినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. గత త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.12,576.80 కోట్ల నుంచి రూ.14,172.90 కోట్లకు పెరుగడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్‌లు 19.9 శాతం చొప్పున పెరుగగా, డిపాజిట్లలో 25.2 శాతం అధికమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్‌లో నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థ..గత త్రైమాసికంలోనూ 4.2 శాతం కనబరిచింది. బ్యాం క్‌ స్థూల నిరర్థక ఆస్తులు విలువ మాత్రం 1.38 శాతం నుంచి 1.42 శాతానికి పెరుగగా, ఇదే సమయంలో నికర ఎన్‌పీఏ 0.42 శాతం నుంచి 0.48 శాతంగా నమోదైంది.


ఎన్‌పీఏల కోసం రూ.3 వేల కోట్లు

మొండి బకాయిలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. గత త్రైమాసికంలో వీటిని పూడ్చుకోవడానికి రూ.3,043.56 కోట్ల నిధులను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.2,211.53 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. కార్పొరేట్‌ ఖాతాల్లో భాగంగా ఒకే ఒక ఖాతా కోసం బ్యాంక్‌ రూ.700 కోట్ల నిధుల కేటాయించింది. బ్యాంకుకు ఇతర మార్గాల ద్వారా రూ.6,669.30 కోట్ల ఆదాయం సమకూరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.4,921.01 కోట్లు లభించాయి. డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ రూ. 11,68,556 కోట్ల నుంచి రూ.13,95,336 కోట్లకు చేరుకున్నది. వీటిలో డిపాజిట్లు 25.2 శాతం పెరిగి రూ.10,67,433 కోట్లకు చేరుకోగా, అడ్వాన్స్‌లు 19.9 శాతం అధికమై రూ.9,36,030 కోట్లకు చేరాయి. బాసెల్‌-3 మార్గదర్శకాలకు లోబడి బ్యాంక్‌ మొత్తం క్యాపిటల్‌ అడెక్విసీ రేషియో 18.5 శాతంగా ఉన్నది. 


logo