శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Oct 18, 2020 , 01:05:19

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దూకుడు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దూకుడు

  • క్యూ2 లాభం రూ.7,703 కోట్లు  
  • గతంతో పోల్చితే 16 శాతం వృద్ధి  l పెరిగిన డిపాజిట్లు, రుణాలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో రూ.7,703 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోల్చితే ఈసారి 16 శాతం పెరిగింది. పోయినసారి రూ.6,638 కోట్లుగా ఉన్నది. ఇక ఏకీకృత ఆదాయం కూడా గతంతో చూస్తే రూ.36, 130.96 కోట్ల నుంచి రూ.38,438. 47 కోట్లకు ఎగిసినట్లు శనివారం ఓ ప్రకటనలో బ్యాంక్‌ తెలియజేసింది. ఏకీకృత అడ్వాన్స్‌లు 14.9 శాతం ఎగబాకి రూ.10.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు రూ.9.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, స్టాండలోన్‌ ఆధారంగా బ్యాంక్‌ నికర లాభం రూ. 7,513.1 కోట్లుగా ఉన్నది. క్రిందటిసారితో చూస్తే ఇది 18.4 శాతం అధికం. స్టాండలోన్‌ ఆదాయం కూడా రూ.36,069.42 కోట్లకు పెరిగింది. 

తగ్గిన ఎన్‌పీఏలు

బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 1.08 శాతానికి తగ్గాయి. గతేడాది సెప్టెంబర్‌ 30 నాటితో పోల్చితే రూ. 12, 508.15 కోట్ల నుంచి రూ. 11,304.60 కోట్లకు దిగివచ్చాయి. స్టాండలోన్‌ ఆధారంగా డిపాజిట్లు 20.3 శాతం పెరిగి రూ.12.29 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం 16.7 శాతం ఎగిసి రూ.15, 776.4 కోట్లుగా ఉన్నది. 

టాటా వాహనాలకు  ఫైనాన్స్‌

రాబోయే పండుగ సీజన్‌ దృష్ట్యా టాటా మోటర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చేతులు కలిపాయి. ఇందులో భాగంగానే టాటా ప్యాసింజర్‌ వాహన కొనుగోలుదారులకు బ్యాంక్‌ ఫైనాన్స్‌ ఇవ్వనున్నది. ఈ మేరకు శనివారం టాటా మోటర్స్‌ తెలియజేసింది. ‘గ్రాడ్యువల్‌ స్టెప్‌ అప్‌ స్కీం’, ‘టీఎంఎల్‌ ఫ్లెక్సీ డ్రైవ్‌ స్కీం’ల పేరుతో రెండు కొత్త పథకాలను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలాఖరుదాకా ఈ స్కీంలు అందుబాటులో ఉంటాయన్నది. గ్రాడ్యువల్‌ స్టెప్‌ అప్‌ స్కీం కింద కస్టమర్లు రుణ మొత్తంలో ప్రతీ లక్షపై కనిష్ఠంగా రూ.799 ఈఎంఐని ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీ డ్రైవ్‌ స్కీం ద్వారా ఏడాదిలో ఏదైనా మూడు నెలలు ఈఎంఐలను చెల్లించే వెసులుబాటును పొందవచ్చు. కనీస ఈఎంఐ లక్ష రూపాయలకు రూ.789గా ఉంటుంది. ఇవి వాహన మోడళ్ల ఆధారంగా మారుతుంటాయని టాటా మోటర్స్‌ స్పష్టం చేసింది.


logo