శనివారం 16 జనవరి 2021
Business - Oct 17, 2020 , 00:55:21

ఆకట్టుకున్న హెచ్‌సీఎల్‌

ఆకట్టుకున్న హెచ్‌సీఎల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16: ఐటీ రంగ సంస్థలు ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లాభాల్లో రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకోగా.. తాజాగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కూడా విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటిచింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,142 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం నమోదైన రూ.2,651 కోట్లతో పోలిస్తే 18.5% వృద్ధిని కనబరిచింది. ఆదాయం కూడా 6.1% పెరిగి రూ.18,954 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ.17,528 కోట్లుగా ఉన్నది. 

 9 వేల ఉద్యోగాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధంలో 9 వేల మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్‌తో తొలి త్రైమాసికంపై పనితీరు ప్రభావం పడినప్పటికీ రెండో త్రైమాసికం నాటికి అన్ని సర్దుకున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తొలి, రెండో త్రైమాసికాల్లో సంస్థ 3 వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకున్నది. 

వేతన పెంపు వచ్చే నెల నుంచి..

సిబ్బందికి శుభవార్తను అందించింది హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ. వచ్చే నెల 1 నుంచి ఈ3 లెవల్‌ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ4, అంతకుమించి స్థాయి ఉద్యోగుల జీతాలను జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా వ్యాపార రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా వేతన పెంపు వాయిదావేసిన విషయం తెలసిందే. గతేడాది సంస్థ దేశీయ సిబ్బంది వేతనాలను 6 శాతం, విదేశాల్లో ఉండేవారి జీతాలను 2.5 శాతం పెంచిన విషయం తెలిసిందే. గత నెల చివరినాటికి సంస్థలో 1.53,085 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. క్యూ3లో ఆదాయం 1.5-2.5 శాతం మేరకు వృద్ధి చెందొచ్చని అంచనావేస్తున్నది. 

l ఆస్ట్రేలియాకు చెందిన డీడబ్ల్యూఎస్‌ లిమిటెడ్‌ను 115.8 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 

శుక్రవారం కంపెనీ షేరు ధర 3.55 శాతం తగ్గి రూ.828.90 వద్ద స్థిరపడింది. రెండో త్రైమాసికంలో అంచనాలకుమించి పనితీరు కనబరిచినాం.  అన్ని వర్టికల్స్‌, సర్వీసు లైన్స్‌, మోడ్‌ 1,2,3 ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. అతిపెద్ద 15 ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆర్డర్‌ బుకింగ్‌లో 35 శాతం వృద్ధి నమోదైంది. 

 - విజయకుమార్‌,

 హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ప్రెసిడెంట్‌, సీఈవో